ఆలూ లేదు చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్లు మన తెలంగాణ కాంగ్రెసోళ్ల తీరు. సీఎం కేసీఆర్ దెబ్బకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లేవకుండా దెబ్బతింది. ఇంకో పక్క కొనవూపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చంపేసి తామే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోంది. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడానికి షర్మిల పార్టీని తీసుకువచ్చేది బీజేపీనే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత జరిగినా కాంగ్రెసోళ్లు మాత్రం ఎవరికి వారు పాదయాత్రల పేరుతో పదవీ యాత్రలు చేపడుతున్నారు.
ఎంతైనా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్సే..కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం..అక్కడ అంతా నెంబర్వన్లే..నెంబర్ టూలు, త్రీలు, ఫోర్లు అంటూ ఎవరూ ఉండరూ..దాదాపు 40 మంది లీడర్ల దాకా ఎవరికి వారు తామే నెంబర్ వన్ అని ఫీల్ అయిపోతారు. అసలు పార్టీకే దిక్కు దివాణం లేదురా బాబూ అంటే వచ్చేసారి అధికారంలోకి వచ్చేస్తాం..ఈలోపు సీఎం క్యాండిడేట్‌గా తమ పేరు లిస్టులో ఉండాలని ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.
కాంగ్రెస్ అంటేనే పీతల వ్యవహారం.. ఒక పీత పైకి పాకుతుంటే..మరో పీత వచ్చి దాన్ని కిందకు లాగి అది పైకి ఎగబాకాలని చూస్తోంది..సేమ్ టు సేమ్ కాంగ్రెస్ నేతల తీరు కూడా అలాగే ఉంటుంది. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పీసీసీ కుర్చీ ఎక్కాలని తెగ ఉబలాటపడుతున్న సంగతి తెలిసిందే. పాపం కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ గానే ఉంది. చూడ్డానికి షార్ట్‌గా ఉన్నా షార్ప్‌గా ఉంటాడు..ఏదో విధంగా గాయి గాయి చేసి గత్తర లేపుతడు ఢిల్లీ పెద్దలు కూడా పీసీసీ కుర్చీ ఇద్దామని అనుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మోకాలడ్డుతున్నరు. థాట్..మాకేం తక్కువ..మేం ఫస్ట్ నుంచి కాంగ్రెస్‌లో ఉన్నం..నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్‌కు పదవి ఇస్తే ఒక్కరు కూడా పార్టీలో ఉండమని ఢిల్లీకి పోయి మరీ బెదిరించిన్రు. దీంతో ఎందుకైనా మంచిదని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ ప్రెసిడెంట్ పదవి వ్యవహారాన్ని పోస్ట్ పోన్ చేసింది. ఇక గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్, జగన్లాగా ఇక్కడ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయితే..మేమేం తక్కువ..తెలంగాణ అంతటా పాదయాత్ర చేసి నేను పార్టీని అధికారంలోకి తీసుకురాలేనా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అధిష్టానం దగ్గర లొల్లిపెట్టిండు..దీంతో ఎందుకొచ్చిన లొల్లి అని ఢిల్లీ పెద్దలు కాంగ్రెసోళ్ల పాదయాత్రలకు నో చెప్పేసింది.
అయితే ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి తెలివిగా రాజీవ్ రైతు భరోసా దీక్ష పేరుతో మొన్న ఆర్మూర్‌లో , నిన్న అచ్చంపేటలో సభలు పెట్టిండు..అక్కడే రేవంత్ పాదయాత్రకు స్కెచ్ వేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితో చర్చించకుండానే అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర మొదలుపెట్టిండు..మూడు రోజులుగా నడుస్తనే ఉండు..రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టగానే..కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కంగారు మొదలైంది..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా అదిలాబాద్ నుంచి రైతు దీక్ష పేరుతో పొలంబాట పట్టిండు..ఇక కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఊరుకుంటాడా..అసలే పీసీసీ ప్రెసిడెంట్ లిస్టులో తన పేరు పెట్టలేదని ఢిల్లీ పెద్దలు పంపించిన ఇంచార్జి మాణిక్యం ఠాగూర్నే పొట్టు పొట్టు తిట్టిండు..అలాంటిది జగ్గన్న రేవంత్, భట్టి పాదయాత్రలు చేస్తే నేను చేయలేనా అంటూ ఆయన కూడా సంగారెడ్డి టు ప్రగతిభవన్‌కు పాదయాత్ర చేసుడు షురూ చేసిండు..అసలు పాదయాత్ర అంటే ఒక నేత చేస్తడు..లేదంటే..నాయకులంతా కలిసి చేస్తరు..కాని మన కాంగ్రెసోళ్లు డిఫరెంట్ కదా..ఎవ్వరికి వారు పాదయాత్రలు మొదలెట్టేసారు. ఈ కాంగ్రెసోళ్ల పాదయాత్రలు చేస్తుంటే ఏదో రైతుల కోసం చేసినట్లు లేవు..పదవీ యాత్రల్లా తెగ కామెడీగా ఉన్నయి..అబ్బబ్బా..కాంగ్రెస్‌లో ఈ సీన్ నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్ అని గాంధీభవన్‌లో ఒకటే జోకులు..అదండి మన కాంగ్రెసోళ్ల పాదయాత్ర ముచ్చట.