రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2,582 మున్సిపాలిటీ వార్డుల్లో 12 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీలలో మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం 6,017 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇవే కాకుండా 7 మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. 414 కార్పొరేషన్ వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 412 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది. కార్పొరేషన్ల పరిధిలో 2,174 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,225 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 25,49,750 మంది పురుషులు, 26,67,025 మంది మహిళలు, 638 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 1,379 మంది ఆర్వోలు, 41,773 మంది పోలింగ్ సిబ్బంది నియమితులయ్యారు. పారదర్శకత కోసం 8,191 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు.
మొత్తం 16,382 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. భద్రతా చర్యల భాగంగా 4,150 మందిని బైండోవర్ చేయగా, 1,183 ఆయుధాలను డిపాజిట్ చేయించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అధికారులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

