మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ

9
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జిహెచ్ఎంసి)ను మూడు భాగాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కోర్ అర్బన్ ఏరియాను పునర్వ్యవస్థీకరిస్తూ పరిపాలనను మరింత సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర నగర ప్రాంతాల పరిపాలనను ఇదే కార్పొరేషన్ పరిధిలో నిర్వహించనున్నారు. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ, ఉత్తర-తూర్పు ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పశ్చిమ హైదరాబాద్ మరియు ఐటీ కారిడార్ పరిధిని కవర్ చేస్తూ “సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్”ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, వేగంగా పెరుగుతున్న నివాస కాలనీలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పరిపాలన అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

అదేవిధంగా, మల్కాజ్గిరి మరియు పరిసర ప్రాంతాలను కలుపుతూ “మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్”ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విభజనతో స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని, మౌలిక వసతుల అభివృద్ధి మరింత సమర్థంగా జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత నగర పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

ALso Read:శ్రీశైలం ఘ‌ట‌న‌పై హ్యూమ‌న్ రైట్స్‌కు ఫిర్యాదు

- Advertisement -