హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ 2017 ఫైనల్ మ్యాచ్‌ను టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించిన సంతోష్ కుమార్ బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఆటగాళ్లను ఉత్సాహపర్చారు. 240 జట్లు తలపడిన ఈ టోర్నిలో హైదరాబాద్, మహబూబ్ నగర్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. సాయంత్రం ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ హాజరవుతారు. విజేతకు ట్రోఫీతో పాటు ప్రైజ్‌మనీ కింద రూ.3లక్షలు, రన్నరప్‌కు రూ.1.5లక్షలు అందజేస్తారు.
జనవరి 7న ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. తెలంగాణలోని పాత పది జిల్లాలనే పది జోన్లుగా విభజించి క్రికెట్ పోటీలను నిర్వహించింది. ప్రతీ జోన్ నుంచి గరిష్టంగా 24 టీమ్ లు పాల్గొన్నాయి. జోన్ స్థాయిలో విజేతకు 30వేల రూపాయలు, రన్నరప్ కు 15 వేల రూపాయలు అందజేయనుంది. గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందిండంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ జాగృతి ఈ టోర్నమెంట్‌ను నిర్వహించింది.