తెలంగాణ రక్షణ హబ్‌ :కేటీఆర్‌

322
- Advertisement -

డిఫెన్స్‌ రంగంలో హైదరాబాద్‌ హబ్‌గా మారుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీసీఐ, సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అండ్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఎస్‌ఐడీఎం ఆధ్వర్యంలో జరిగిన డిఫెన్స్ కంపెనీల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఈకో సిస్టం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, గత 7సంవత్సరాలకుపైగా కాలంలో ఇక్కడి డిఫెన్స్ ఈకో సిస్టం భారీగా విస్తరించిందని కేటీఆర్‌ తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో స్థానికంగా సుమారు 1000కిపైగా ఎంఎస్‌ఎంఈ సంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు.

తెలంగాణలో ఉన్న డిఫెన్స్ పరిశోధన, అభివృద్ధి రంగం అత్యంత కీలకమైనదని, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరు ఉన్నదన్నారు. ఇక్కడే డీఆర్‌డీవో, బెల్‌, హాల్‌ అనేక రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు సైతం తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రఖ్యాత డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ సంస్థలైన లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ టీఎస్‌ ఐపాస్‌ విధానం, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కోతలులేని 24 గంటల పారిశ్రామిక విద్యుత్‌ సదుపాయం వంటి అంశాలను తమ పెట్టుబడి ప్రణాళికల్లో పరిగణలోకి తీసుకోవాలని డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ప్రైవేట్‌ సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీంతోపాటు ప్రపంచ స్థాయి క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి వాటితో సైతం తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్‌తో హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ ఈకో సిస్టం బలంగా ఉన్నదని పేర్కొన్నారు. బోయింగ్ కంపెనీ ఇన్నోవేషన్ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐడీఈఎక్స్‌ వంటి ఇంకుబేషన్ కార్యక్రమాలను సైతం చేపడుతున్న విషయం మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించి, అండగా ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఓఎస్‌డీగా ఉన్న సీనియర్ అధికారి సంజయ్ జాజు, తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఏరో స్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

కేంద్రం కీలక నిర్ణయం….

ఏరియల్ వ్యూ ద్వారా ప‌వ‌ర్ ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం

దామరచర్లకు సీఎం కేసీఆర్..

- Advertisement -