తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా గండికోట శ్రీదేవి నియమితులయ్యారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఉన్న ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏపీకి చెందిన శ్రీదేవి తనను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం ..తెలంగాణ హైకోర్టుకు శ్రీదేవిని బదిలీ చేయాలని ఏప్రిల్ 15న సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందాక కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజేందర్ కశ్యప్ బదిలీ ఉత్తర్వులిచ్చారు.
విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో యూపీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2016లో ఆమె జిల్లా, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. ఘాజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.