కోరుట్లలో బోణి కొట్టిన టీఆర్ఎస్

296
trs korutla

స్ధానిక సంస్థల ఎన్నికల సమరంలో టీఆర్ఎస్ బోణి కొట్టింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం నుంచే జైత్రయాత్రను ప్రారంభించింది. కీలకమైన వెల్గటూర్ జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగీవ్రం కాగా, ఇదే నియోజకవర్గంలో మరో మూడు ఎంపీటీసీ స్థానాలు సైతంగులాబీ ఖాతాలో పడ్డాయి.

రెండో దశలో స్ధానిక ఎన్నికల సమరానికి గురువారం చివరి రోజు కావడంతో కోరుట్ల జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బరిలో ఉండగా బీజేపీ అభ్యర్థి పిడుగు లక్ష్మి కాంగ్రెస్‌ అభ్యర్థి బొల్లపెల్లి సంజన తమ నామినేషన్లను ఉపసంహ రించున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దారిశెట్టి లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌-2 ఎంపీటీసీ స్థానానికి చింతకుంట వనిత, వెంకటాపూర్‌ ఎంపీటీసీ స్థానానికి తోట నారాయణ, ధర్మారం ఎంపీటీసీ స్థానానికి నాగిరెడ్డి సుభాష్‌రెడ్డి,మేడిపల్లి మండలం రాగోజిపేట ఎంపీటీసీ స్థానానికి చెన్నమనేని రమ్య ఏకగ్రీవమయ్యారు.

జడ్పీటీసీగా ఎన్నికైన లావణ్యను కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు అభినందించారు. లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల మండలంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఈ నెల 10న పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.