అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరగాలి: హరీశ్‌ రావు

77
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచింగ్‌ ఆసుపత్రిల్లో బ్రెయిన్‌డెడ్‌ నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నిమ్స్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు సాధ్యమైనంత త్వరగా ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. బెడ్ ఆక్యుపెన్సి రేటు 100 శాతానికి పెంచాల‌న్నారు.

ఈ సందర్భంగా జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, నిమ్స్, ఎంఎన్‌జే డైరెక్టర్లు, అన్ని విభాగాల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చూసి, జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాల్లో ప్రమాద వశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ, ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో జరపక పోవడం వల్ల, ఆ పేషంట్ అవయవాలు ప్రాణ దానానికి అవకాశం లేకుండా పోతున్నాయి. ఒక వేళ జిల్లాలోని టీచింగ్ ఆస్ప‌త్రుల్లోనే బ్రెయిన్ డెడ్ నిర్ధారించగలిగితే, అవయవాలు సేకరించి, అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్స జరిపి మార్పిడి ద్వారా ప్రాణం కాపాడటం సాధ్యం అవుతుంది.

సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ నుండి కార్నియా, గుండె, కాలేయం, లంగ్స్, కిడ్నీలు సేకరించి, జీవన్ దాన్‌లో రిజిస్టర్ అయి ఏళ్ల కాలం నుండి ఎదురు చూస్తున్న వారికి అవయవ మార్పిడి చేసి ప్రాణం కాపాడవచ్చు. ఒక్కరి నుండి సేకరించిన అవయవాలు ఐదుగిరి ప్రాణాలు నిలబెడతాయ‌న్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిమ్స్‌లో 70 అవయవ మార్పిడులు జరిగాయి. గత ఏడాది వంద జరిగాయి.ఈ ఏడాది కూడా వందకు పైగా అవయవ మార్పిడి జరిగేలా పని చేయాలని కోరుతున్నాన‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

నిమ్స్‌లో పరీక్ష ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలి. అత్యవసర విభాగంలో ఉన్న పేషెంట్లను స్టెబిలైజ్ చేసి వెను వెంటనే అయా విభాగాలకు పంపాలి. కొత్తగా వచ్చే పేషెంట్ల కోసం పడకలు అందుబాటులో ఉంచాలి. నిమ్స్ బెడ్ ఆక్యుపెన్స్ 77 శాతం ఉంది. ఇది చాలా తక్కువ. ఒకపక్క బెడ్స్ లేవని అంటూనే, ఇక్కడ 27 శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు రిపోర్టులో ఎలా పేర్కొన్నారు. బెడ్ ఆక్యుపెన్సీ పెంచాలి. వంద శాతం పెరగాల‌ని హ‌రీశ్‌రావు ఆదేశించారు.

ఎంఎన్‌జే అధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ స్క్రీనింగ్ క్యాంప్స్ జిల్లాల్లో ఎక్కువగా జరగాలి. క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యాంప్‌లు పెట్టాలి. వారానికి 3 క్యాంపులు నిర్వహించి క్యాన్సర్ వ్యాధిగ్రస్థులను గుర్తించి చికిత్స అందించాల‌ని మంత్రి సూచించారు.

ఎంఎన్‌జేలో ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ పాలియేటివ్ విషయంలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నాం. అడల్ట్ పాలియేటివ్ కేర్ విభాగంలో మరో 50 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో 33 పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు కాబట్టి అందరం బాగా కృషిచేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందిద్దాం అని కోరుతున్నాను అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -