నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. ఇప్పటికే పలు శాఖలలో నియామకాలు చేపట్టిన ప్రభుత్వం వివిధ హోదాల్లో కలిపి తాజాగా మరో 463 పోస్టులను భర్తికి రంగం సిద్దంచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికశాఖలో ఉన్న 463 పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. మండల ప్రణాళిక, స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ క్యాడర్లలో ఖాళీలను పూర్తిచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్ శివశంకర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఖాళీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ అధికారులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చి ఉద్యోగ నియామకాలకు సహకరించాలని సూచించారు.
అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని శాఖలలో మొత్తం ఉద్యోగాల సంఖ్యను అవసరమైనమేర సర్దుబాటు చేస్తూ ఆర్థికశాఖ విడిగా మరో ఉత్తర్వులను జారీచేసింది. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయ, సహకారశాఖల్లో కొత్తపోస్టులను మంజూరు చేసింది. అదే సమయంలో ఆయాశాఖల్లో అవసరం లేని పోస్టులను తొలిగించింది. ఆర్థికశాఖలోని వివిధ క్యాడర్లకు కొత్తగా 239 పోస్టులను మంజూరు చేసింది. అవసరం లేవని భావించిన 259 పోస్టులను తొలిగించింది.
ఈ నిర్ణయంతో ఆర్థికశాఖలో మొత్తం క్యాడర్ స్ట్రెంత్ 1,431 ఉండగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,411 కి చేరింది. వ్యవసాయ, సహకారశాఖల్లో కూడా కొత్త జిల్లాల పరిపాలనకు అనుగుణంగా ప్రస్తుతం వివిధ క్యాడర్లలో 23 పోస్టులను తొలిగించగా మరో 15 పోస్టులను మంజూరుచేసింది. దీంతో ఈ శాఖల్లో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 350 నుంచి 327 కు చేరింది. ప్రణాళికాశాఖలో గణాంకాధికారుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై తెలంగాణ ఎకానమిక్ స్టాటిస్టికల్ సబార్డినేట్ అసోసియేషన్ (టెస్సా) హర్షం వ్యక్తం చేసింది.