జూన్ 2న అమరవీరులకు నివాళులు అర్పించి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర అవతరణ వేడుకలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ జూన్ 3న కేసీఆర్ కిట్ల పంపిణీ, జూన్ 4న ఒంటరి మహిళలకు భృతి పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మండలం యూనిట్‌గా ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు పతాకావిష్కరణ చేస్తారని వెల్లడించారు.
గ్రామం నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు జరగాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ రాష్ట్రావతరణ వేడుకల వాతావరణం కనిపించాలన్నారు సీఎం.మండలాల్లో జరిగే వేడుకల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అతిథులుగా పాల్గొనాలన్నారు. జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక అమరవీరుల స్థూపాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ శాశ్వత అమరవీరుల స్థూపాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జీహెచ్‌ఎంసీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన జంక్షన్లు, రహదారులు,ఫ్లెఓవర్లను మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించాలని నిర్ణయించారు. సర్కిళ్లవారీగా నగరంలోని 400స్వచ్ఛ హైదరాబాద్ యూనిట్లలో ప్రత్యేకంగా కార్యప్రణాళిక రూపొందించారు. రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చూడడం, చెత్తకుప్పలు లేకుండా మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నగరమంతా విద్యుత్ కాంతుల ఏర్పాటుతో పాటు పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు.