ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియసైంది. ఆర్టీసీ సమ్మె చట్టవ్యతిరేకమని…సమ్మెలో పాల్గొనే సిబ్బందిని తొలగించాల్సి వస్తుందని వెల్లడించింది. కార్మికులు సమ్మెకు వెళితే డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తహసీల్దార్లకు ఆర్టీసీ అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. 9 వేల వరకు ప్రైవేట్, పాఠశాలల బస్సులు సిద్ధం చేశామని… రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
అంతేకాదు కార్మికులతో చర్చల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమటీని రద్దు చేసింది. చర్చలు జరుగుతుండగా సమ్మె చేయడం చట్ట విరుద్ధమని.. డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పినా సమ్మె చేయడం సరికాదన్నారు మంత్రి పువ్వాడ అజయ్. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. తాము ఎప్పుడూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదన్నారు.