విద్యా ప్రమాణాలను పెంచాము : మంత్రి కేటీఆర్‌

86
ktr1
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టూ పీజీ విద్యా ప్ర‌మాణాల‌ను పెంచామ‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ చేప్పారు. విద్యా రంగంలో గ‌తంలో జ‌ర‌గ‌ని ఎన్నో మార్పులు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఇప్పుడు జ‌రుగుతున్నాయ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. దుండిగ‌ల్ ప‌రిధిలోని బ‌హ‌దూర్‌ప‌ల్లిలో ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వొకేష‌నల్ కాలేజీకి కూడా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సుర‌భి వాణిదేవీతో పాటు ప‌లువురు ప్రజా ప్రతినిధులు, నాయ‌కులు పాల్గొన్నారు.

2013లో ఇదే కాలేజీ ఆవ‌ర‌ణ నుంచి ఉద్య‌మంలో భాగంగా స‌క‌ల జ‌నుల భేరీ నిర్వ‌హించామని గుర్తు చేశారు. శంభీపూర్ రాజు ఆధ్వ‌ర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ ఇక్క‌డ్నుంచే ప్రారంభించమన్నారు. ఈ కాలేజీలో ఆ రోజు పాడుబ‌డ్డ గోడ‌లు, శిథిలావ‌స్థ భ‌వ‌నాలు ఉండేవి. ఈనాడు ఈ కాలేజీని అద్భుతంగా తీర్చిదిద్దారు. వొకేష‌న‌ల్ కాలేజీకి కూడా శంకుస్థాప‌న చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

మ‌న‌కంటే మ‌న పిల్ల‌లు ఉన్న‌త‌స్థితిలో ఉండాల‌ని ప్రతి త‌ల్లిదండ్రులూ కోరుకుంటారు. అది జ‌ర‌గాలంటే.. ప్రాథ‌మిక, మాధ్య‌మిక విద్య నుంచి ఉన్న‌త విద్య వ‌ర‌కు అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాలి. గ‌త 8 ఏండ్ల‌లో కేసీఆర్ విద్యా ప్ర‌మాణాల‌ను పెంచేందుకు కృషి చేస్తున్నారు. అంగ‌న్ వాడీ విద్య నుంచి మొద‌లుకొంటే యూనివ‌ర్సిటీ విద్య వ‌ర‌కు మార్పులు తెచ్చి, విద్యా ప్ర‌మాణాల‌ను పెంచేందుకు చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రాథ‌మిక నుంచి మాధ్య‌మిక విద్య వ‌ర‌కు 973 గురుకుల పాఠ‌శాల‌లు స్థాపించామన్నారు. నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డ‌మే కాకుండా, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పిస్తున్నాం. ప్ర‌పంచంతో పోటీ ప‌డే పౌరులుగా విద్యార్థుల‌ను తీర్చిదిద్దుతునమన్నారు. గురుకుల విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధిస్తున్నారంటే అది ప్ర‌భుత్వ కృషి మాత్ర‌మే అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో గ‌త 65 ఏండ్ల‌లో ఐదు మెడిక‌ల్ కాలేజీలు వ‌స్తే… ఇప్పుడు జిల్లాకు ఒక‌టి చొప్పున 33 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. తద్వారా మన పిల్లలు వైద్య విద్య కోసం వివిధ ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇంట‌ర్మీడియ‌ట్ నుంచి ఉన్న‌త విద్య వ‌ర‌కు రూ. 18 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ అందిస్తుమన్నారు. మ‌హాత్మా జ్యోతి బాపూలే, అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ స్కాల‌ర్ షిప్ కింద విదేశీ విద్య కోసం రూ. 20 ల‌క్ష‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఏవియేష‌న్, ఆటో మొబైల్ యూనివ‌ర్సిటీలు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఒక వైపు విద్య‌కు, మ‌రో వైపు ఉపాధి క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -