లక్ష పదాలతో తెలంగాణ నిఘంటువు

245
telangana dictionary soon
- Advertisement -

ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ యాస, భాషలు ఆయువుపట్టుగా నిలిచాయి. రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ల నోళ్లయాస భాష తొక్కిపట్టినప్పుడు ఆయన గర్జించాడు కాళోజీ. తనది బడిపలుకుల భాష కాదు. పలుకుబడుల భాష. ఏ ఇద్దరి దస్తూరీ ఒక్కరకంగా వుండనట్లుగా.. ఏ ఇద్దరి ఉచ్ఛరనా ఒక్కరకంగా వుండదు.ఇలా 20వ శతాబ్దపు తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చరిత్రలో కాళోజీ ఒక అద్భుత అధ్యాయం.

తెలంగాణ ఉద్యమంలో గజ్జెకట్టి, పాటపాడి మన యాస, పదాలను విశ్వవ్యాప్తం చేశారు కళాకారులు. ఇప్పుడా యాస, భాషలను సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తోంది పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. సుమారు లక్ష పదాలతో నిఘంటువును రూపొందించాలని తెలుగు వర్సిటీ కసరత్తు చేస్తోంది. ఏడాదిపాటు తెలంగాణ యాసకు సంబంధించి అరుదైన పదాలన్నింటినీ సేకరిస్తారు. దీనిలో భాగంగా ప్రముఖ రచయితలు, భాషాభిమానులను సంపద్రించి, పలు పుస్తకాలను సమగ్రంగా అధ్యయనం చేసి నిఘంటువును రూపొందించనున్నారు. దీనికి విద్యార్థులు, ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని విశ్వవిద్యాలయ అధికారులు ఆశిస్తున్నారు.

రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చాలామంది తెలంగాణ యాసలోని అరుదైన పదాలు మాట్లాడుతుంటారు. ఇవి రాష్ట్రంలోని పట్టణ, నగర ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా ఈ తరం వారికి తెలియడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా పదాలు ప్రస్తుతం వాడుకలో లేవు. అలాంటి వాటిని ఆయా ప్రాంతాల్లోని వయోవృద్ధులు, భాషాపండితుల నుంచి సేకరించే భారీ కార్యక్రమాన్ని తెలుగు విశ్వవిద్యాలయం చేపట్టనుంది. దీనికోసం ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.

తెలంగాణ యాసకు ఎంతో చరిత్ర ఉందని .. భావితరాలకు ఈ భాష, యాసను అందించేందుకు తెలుగు విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. 2018 జూన్‌ 2నాటికి ప్రజలకు ఈ నిఘంటువును అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

- Advertisement -