దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పార్టీ అధిష్టానంతో అత్యంత కీలకమైన సమావేశం కానున్నారు. ఈ భేటీకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కీలక మంత్రులు, నేతలు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం చర్చకు రానుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీకి సంబంధించి హైకమాండ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాబోయే ఆగస్టు రెండో వారంలో కనీసం రెండు మంత్రి పదవులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ నాయకులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరనున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆధారంగా ఈ పదవులను భర్తీ చేసే యోచనలో నాయకత్వం ఉంది.
మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, నాయకుల క్రమశిక్షణారాహిత్యంపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన తుంగతుర్తి నియోజకవర్గ వ్యవహారం….నిలకడగా సాగుతున్న కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ మధ్య వివాదంపై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌గా విమర్శలు చేసుకోవడం రచ్చకెక్కడం పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే అభిప్రాయాన్ని అధిష్టానం వ్యక్తం చేసింది.
ఈ వివాదాలపై ఇప్పటికే స్పందించిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాల్సిన సున్నితమైన అంశాలను బహిరంగపరచడం తీవ్రంగా ఖండించదగిన విషయమని పేర్కొంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ లైన్ దాటి వ్యవహరించే నాయకులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని అధిష్టానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. నేటి ఢిల్లీ భేటీలో ఈ నేతలను పిలిచి మందలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కేబినెట్ విస్తరణపై ఒక స్పష్టత రావడంతో పాటు అసంతృప్త నేతలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తుందో వేచి చూడాలి.
Also Read:మోదీపై అసభ్యకర పోస్టులు..పోలీసుల నోటీసులు

