దళిత బంధును అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలి సీఎం

74
kcr
- Advertisement -

ప్రగతి భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న జ‌రిగిన‌ కేబినెట్ భేటీలో పలు కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. పోడు భూముల విషయంపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, ఫారెస్ట్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలతో పాటు జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో.. ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని కేబినెట్ సూచించింది.

దళిత బంధును ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఈ పథకాన్ని అందిస్తున్నారు. 100 మంది లబ్ధిదారులతో పాటు మరో 500 మందికి కూడా దళిత బంధు పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఇదే విధానాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న నేపథ్యంలో మిగిలిన 118 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ మెంబర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీలో 5 నుండి 15 వరకు, ఇతర కార్పొరేషన్లలో 5 నుండి 10 వరకు కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్ట్ యూనివర్శిటీకి కొత్త పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయించారు. సుంకిశాల నుంచి హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగు పరచాలని నిర్ణయం తీసుకున్నారు. అదనంగా మరో 33 టీఎంసీల నీటిని శుద్ధి చేసి నగర ప్రజలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.2214.79 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలను త్వరతగతిన ప్రారంభించాలన్నారు.ఇందుకోసం నూతనంగా 21 జిల్లా కేంద్రాల్లో భవనాల స్థలాలు కేటాయింపు జరపాలన్నారు. భద్రాచలంలోని ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

సెప్టెంబర్‌17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరపాలని నిర్ణయించారు. అదే రోజున హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అదే విధంగా అన్ని జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు.

- Advertisement -