సకల రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వేగంగా పురోగమిస్తుందని, తనను తాను పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గొల్కొండ కోటలో జరిగిన 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంద్రగాస్టు వేడుకలను ఉద్దేశించి మాట్లాడుతూ చారిత్రక గొల్కొండ కోటలో వరుసగా ఐదో సారి జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని స్వయంగా ప్రధాని మోడీనే పార్లమెంట్‌లో ప్రస్తావించారని, సమయం వృధా చేయకుండా తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేదని, రైతుల ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో ఎగబెట్టిన ఇన్‌పుట్ సబ్బిడీలను తెలంగాణ ప్రభుత్వం సత్వరం చెల్లించిందని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నామని, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులను అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకున్నామని, కల్తీ విత్తన తయారీదారులపై పీడి యాక్ట్ కేసులు పెట్టామని, కల్తీ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపీ అణచివేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు వేదికలను నిర్మిస్తున్నమని, యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు పనిముట్లపై 50 నుంచి 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
డ్రిప్ ఇరిగేషన్‌పై దళితులు, చిన్న, సన్న కారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసుకున్నామని, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టామని, 22.47 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్లను అందుబాటులోకి తెచ్చామని, భూరికార్డుల ప్రక్షాళనలో ఏ ప్రభుత్వం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని, భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసం ధరణి వెబ్ సైట్ రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.