తెలంగాణ బడ్జెట్ తో వర్థిల్లుతుందని..మిగులు రాష్ట్రంగా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం సుఖ శాంతులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పండితులు చెప్పడం సంతోషకరమన్నారు. సుసంపన్నంగా తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో తులతూగుతుందన్నారు. జాతి నిర్మాణ రంగంలోనూ అద్భుత పాత్ర పోషిస్తున్నామని, దేశంలోనూ రోల్ మోడల్ గా తెలంగాణ నిలవడం గర్వకారణమన్నారు. దేవభూమి తెలంగాణ అని, ఇండియాలో పూజారులకు, అర్చకులకు జీతాలు ఇస్తున్న ఘనత ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు.
తెలంగాణ అద్భుతమైన వెలుగుజిలుగులతో విరాజిల్లుతుందని పంచాంగకర్తలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సిరిసంపదలతో తులతూగుతుందని పంచాంగకర్తలు చెప్పారని సీఎం గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రం రాశి కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2. రాష్ట్రం తప్పకుండా సుసంపన్నంగా ఉంటుంది. తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటుందని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. ఆ విధంగానే రాష్ట్రం ఉండబోతుందని సీఎం స్పష్టం చేశారు. రవాణా, ఆరోగ్య శాఖల పనితీరు బాగుటుందని శాస్త్రి చెప్పడంతో ఆ శాఖల మంత్రులకు ఎలాంటి ఢోకా లేదన్నారు సీఎం. శాంతిభద్రతలు సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. పోలీసు శాఖ సమర్థవంతంగా పని చేస్తుందని కేసీఆర్ ఉద్ఘాటించారు.