రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నీతి ఆయోగ్ పాలకమండలి నాలుగో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక పథకాలకు కేంద్రం బాసటగా నిలవాలని కోరారు. కేంద్రం చేపట్టే పథకాలకు రాష్ట్రంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని కేంద్రానికి స్పష్టంచేశారు. వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయంలోనైనా సహకరిస్తామని చెప్పారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆగస్టు 15 నుంచి తీసుకురానున్న రైతు బీమా పథకానికి సాయం చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీ, మిషన్ భగీరథ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పథకం గురించి కేసీఆర్ వివరించారు. తెలంగాణలో 98% మంది రైతులు సన్న, చిన్న కారులే ఉన్నారని, అలాంటి రైతులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తోందని చెప్పారు. రెండు విడుతలుగా మొత్తం కలిపి ఎకరానికి రూ.8000 ఇస్తున్నామని, ఈ డబ్బులు చెక్కుల రూపంలో నేరుగా రైతులకు అందేలా చేస్తున్నామని సూచించారు.
రైతులకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి అత్యాధిక పద్దతులు ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తైతే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. రైతు పండించిన పంటలను నిల్వ చేసేందుకు గత మూడేళ్ల వ్యవధిలో రూ.1,050 కోట్ల బడ్జెట్ తో 18.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల 356 గోడౌన్లను నిర్మించామని తెలిపారు.
భారత దేశ అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధితో ముడి పడి ఉందని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం సాయం అందించాలని కోరారు. వ్యవసాయంతో పాటు అనుబంద రంగాలైన డెయిరీ, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల పెంపకం, చేపల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాలని. ఆయా రంగాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచించారు. దేశాభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం చేపట్టవలసిన చర్యల గురించి సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు.