మునుగోడు ఉప ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఈ విషయమై వికాస్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల కోసం బ్యాలెట్ పేపర్ల ముద్ర పూర్తయిందన్నారు. 35 శాతం అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు రిజర్వ్ అధికారికి కేటాయించాం. అవసరమైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు.
మునుగోడులో ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయి. అక్రమంగా తరలిస్తున్న రూ.2.49 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. సమాచారం కోసం 0868-2230198 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 3న జరుగనున్న విషయం తెలిసిందే.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలు ఉన్న కార్యాలయాలు, సంస్థలకు పోలింగ్ ముందు రోజు కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసే కార్యాలయానికి లెక్కింపు రోజున కూడా సెలవు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పోలింగ్ రోజు సెలవు ప్రటించేందుకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.