తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 30 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక రూ. 2.80 లక్షల కోట్లతో ఏపీ ప్రభుత్వం ఓట్ ఆన్ బడ్జెట్లను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపుతారనే అంశంలో ఆసక్తి నెలకొంది. లోక్ సభ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తున్న నేపథ్యంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాయి.
ఇటీవలె అసెంబ్లీ ఎన్నికలు జరిగి పూర్తిస్థాయి మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. పూర్తిస్థాయి బడ్జెట్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయేది ఎంపీ స్థానాలకే కాబట్టి… రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్టే ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఒకటి.. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 14 నుండి 16వ తేదీల్లో కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి రానుంది. కమిషన్ ద్వారా సాయం ఎంతొస్తుంది ? దానిపైన కూడా ఒక స్పష్టత వస్తుంది. అందుకే ఫిబ్రవరి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశ పెడితే…బాగుంటుందని సర్కార్ యోచిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో చర్చల సందర్భంగా బడ్జెట్ సమావేశాల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. ఇప్పటికే శాఖల వారీగా ప్రతిపాదనలు చేయాలని సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించంది.