వైజాగ్‌లో సీఎం కేసీఆర్‌,జగన్‌ భేటీ..!

218
jagan kcr
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఏపీలో పర్యటిస్తారన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశాఖలో ఫిబ్రవరి 10 నుండి 14 వరకు శారద పీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌కు ఆహ్వానం అందింది. దీంతో వీరిద్దరి భేటీకి వైజాగ్‌ వేదిక కానుందని టాక్‌ వినిపిస్తోంది.

శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో కేసీఆర్‌,జగన్‌లకు సన్నిహిత సంబంధం ఉంది. తెలంగాణలో ఎన్నికలకు వెళ్లేముందు ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్‌లో చండీయాగం నిర్వహించిన కేసీఆర్ తర్వాత సైతం శృంగేరి పీఠం సంప్రదాయం ప్రకారం సహస్ర చండీయాగాన్నినిర్వహించిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అటు జగన్‌ సైతం పాదయాత్ర ప్రారంభించే ముందు శారదపీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 10 నుండి 14 వరకు విశాఖలో జరిగే శారదా పీఠం వార్షికోత్సవాల్లో వీరు పాల్గొననున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. వార్షికోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 14న నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం సందర్భంగా జగన్‌తో కేసీఆర్ భేటీ కానున్నారట.ఏపీలో టీడీపీని ఓడించేందుకు కావాల్సిన సూచనలు,సలహాలు ఈ సమావేశంలో జగన్‌కు ఇవ్వనున్నారట కేసీఆర్‌.

ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తానని కేసీఆర్ చెప్పడం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌..జగన్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేగాదు త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతానని జగన్‌ ప్రకటించడంతో వీరిద్దరి భేటీ కోసం తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -