కాషాయపార్టీకి రాంరాం..కాంగ్రెస్‌కు వెల్‌కమ్..!

153
bjp
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రతో కమలం పార్టీకి మైలేజీ ఎంత వచ్చిందో కాని… రివర్స్‌లో వలసలు మాత్రం షురూ అయ్యాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న తాపత్రయంతో బండి సంజయ్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయెగించాడు. ఈక్రమంలో రమేష్ రాథోడ్, పాల్వాయ్ హరీష్, కూన శ్రీశైలం గౌడ్, విక్రమ్ గౌడ్ వంటి కీలక కాంగ్రెస్ నేతల సహా దాదాపుగా అన్ని జిల్లాలలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బీజేపీకి సీన్ రివర్స్ అవుతోంది. వరుసగా దళిత, గిరిజన దండోరా సభలు, జంగ్ సైరన్లతో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదుగుతుందనే నమ్మకాన్ని మాత్రం రేవంత్ కల్పించాడు. దీంతో కమలం పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు మళ్లీ పునరాలోచనలు పడ్డారు. అంతే కాదు బీజేపీ మతవిద్వేష రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగిపోయిన కరడుగట్టిన కాషాయ నేతలు కూడా ఇప్పుడు రాజీనామాబాట పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జిన్నారెడ్డి పద్మజ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పద్మజ ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తికి పంపించారు.

కాగా పద్మజ భర్త జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు సీనియర్ రాజకీయవేత్తగా మానుకోట జిల్లా ప్రజలకు సుపరిచితులు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పదవుల్లో కొనసాగారు. మానుకోట పరిసర గ్రామాల్లో ఆయనకు మంచి పేరు ఉండేది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో ఆయన తన సతీమణి పద్మతో కలిసి బీజేపీలో చేరారు. కాగా ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తుండడంతో జిన్నారెడ్డి దంపతులు బీజేపీని వీడి హస్తం గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. వరంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మొత్తంగా మహబూబాబాద్ బీజేపీ జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు జిన్నారెడ్డి పద్మజ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాషాయ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది. కమలం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు షురూ అవడంతో బండి సంజయ్‌‌కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయిందనే చెప్పాలి.

- Advertisement -