దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కన్ను తెలంగాణపై పడింది. తమిళనాడులో డబ్బు సంచులతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి విఫలమైన పువ్వు పార్టీ… దేశప్రజల సాక్షిగా అబాసుపాలుకాగా తాజాగా మరోసారి తన కషాయ బుద్దిని బయటపెట్టుకుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి ప్రజలముందు అడ్డంగా బుక్కైంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం కాగా బీజేపీ నేతలను ప్రజలు చీదరించుకుంటున్నారు.
దీంతో తప్పును కప్పి పుచుకునేందుకు రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ బ్యాచ్ తమకు అలవాటైన అబద్దాలను అవలీలగా చెప్పే ప్రయత్నం చేశారు. అసలు బెరసారాలకు వచ్చిన వారేవరో తమకు తెలియదని ఇదంతా టీఆర్ఎస్ కుట్ర అని ఆరోపించే ప్రయత్నం చేయగా ప్రజల ముందు వారి పప్పులు మాత్రం ఏమాత్రం ఉడకలేదు. ఎందుకంటే బెరసారాలకు వచ్చిన వారు బీజేపీ నేతలతో సత్సంబంధాలున్నవారే.
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఎపిసోడ్‌లో కీలకమైన వ్యక్తి రామచంద్రభారతి. స్వామీజీగా పేరున్న ఈయన బీజేపీ పరివారంలో అతి ముఖ్యుడు. బీజేపీలో నంబర్- 2 గా చక్రం తిప్పుతున్న ప్రముఖుడికి రామచంద్ర భారతి అత్యంత సన్నిహితుడు. ఆయన స్వస్థలం ఫరీదాబాద్. ఉత్తర కాశీలో ఉన్న కపిలాశ్రమానికి ఆయన అధిపతి. ఈ కుట్రలో పాలు పంచుకున్న మరో స్వామీజీ పేరు వెంకటనాథ సింహయాజి. తిరుపతిలోనూ, కడపలోనూ మంత్రరాజ మఠం పేరుతో ఆయనకు ఆశ్రమాలున్నాయి. మూడో వ్యక్తి నందు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి. బీజేపీ వర్గాలకు సన్నిహితుడు. ఆయన హోటల్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. బండి సంజయ్ తదితర బీజేపీ నేతలందరితోనూ నందు దిగిన ఫొటోలున్నాయి.
అంతేగాదు స్వామిజీతో పాటు ఈ ఎపిసోడ్‌లో ఉన్న అందరితో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు వారేవరో తమకు తెలియదని బుకాయిస్తున్న బీజేపీ నేతలకు నెటిజన్లు ఈ ఫోటోలను షేర్ చేస్తూ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా దక్షిణాదిన డబ్బు సంచులతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీ నేతల పాచిక పారకపోవడమే కాదు వారి ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది.
ఇవి కూడా చదవండి…