కేంద్రం మార్గదర్శకాలను తెలంగాణలో అమలు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్…రెడ్ జోన్‌లో షాపుల ఓపెన్‌కు కేంద్రం అనుమతిచ్చిందని కానీ తెలంగాణలో రెడ్ జోన్‌లలో ఎలాంటి షాపులు ఓపెన్ చేయడం లేదన్నారు.
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కేంద్రం మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు. వ్యవసాయ పనులు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో లాక్ డౌన్ పొడగించడం తప్ప తమకు వేరేమార్గం లేదన్నారు. కొంతమంది ప్రజలకు కోపం వచ్చినా అందరి సూచనల మేరకు లాక్ డౌన్‌ను పొడగిస్తున్నట్లు ప్రకటించారు.
మే 15న రెడ్ జోన్లలో షాపుల ఓపెన్, దేశంలో కరోనా పరిస్ధితిపై అంచనాకి వచ్చి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్నిరకాల షాపులు ఓపెన్ చేసుకోవచ్చన్నారు సీఎం కేసీఆర్. మున్సిపాలిటీల్లో మాత్రం 50 శాతం షాపులు మాత్రమే తెరుచుకుంటాయని చెప్పారు. నిర్మాణ రంగ పనులు కొనసాగుతాయని తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో కార్యకలాపాలు ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్, ఇసుక మైనింగ్ జరుగుతుందన్నారు.
ఆర్టీఏ ఆఫీసులు పనిచేసుకోవచ్చన్నారు. 10వ తరగతి విద్యార్ధులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని హైకోర్టు సూచనలు పాటిస్తామన్నారు. ఇప్పటివరకు 10వ తరగతి విద్యార్ధులు 2 పరీక్షలు రాశారని మిగితా 8 పరీక్షలు రాసేలా చూస్తామన్నారు. భౌతికదూరం పాటించేలా పరీక్షలు సజావుగా నిర్వహిస్తామని చెప్పారు.