- కేంద్రం కళ్ళు తెరవాలంటున్న బిజెపి నేతలు
- కెసిఆర్ వాదన జనంలోకి వెళ్ళిందట
- తెలంగాణకు చేసిన అన్యాయంపై చర్చ
- బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే చర్చ
- పార్టీకి చేటుచేస్తున్న కేంద్ర ఆర్ధిక విధానాలు
- బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే చర్చ
- తెలంగాణ బిజెపిలో అంతర్మధనం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ఆదాయంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 41 శాతం నిధుల్లో ఆచరణలో భారీగా కోతలు విధిస్తూ 29.6 శాతానికి కుదించిందని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యిందని కొందరు సీనియర్ బిజెపి నాయకులే అంటున్నారు.
పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు వాటాలు ఇచ్చే విషయంలో జరుగుతున్న మోసం, ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టంలో తెచ్చిన లోపభూయిష్టమైన మార్పులు, నీతి ఆయోగ్ సిఫారసులు, 14వ ఆర్ధిక సంఘం, 15వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సిఫారసులను అమలు చేయకపోవడం… అనేటువంటి అంశాలతోపాటుగా తెలంగాణ రాష్ట్రం కేంద్రంపై చేస్తున్న ఒంటరిపోరాటానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు సీరియస్గా ఆలో చనలు చేస్తున్నాయని తెలంగాణ బిజెపిలోని కొందరు సీనియర్ నాయకులు తెలిపారు.
అంతేగాక బిజెపి పాలిత రాష్ట్రాలకు కూడా జరుగుతున్న ఆర్ధికపరమైన అన్యాయాలపైన, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతాంగ సంక్షేమ పథకాలు తమతమ రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం వంటి అంశాలు బిజెపి అధిష్టానానికి తలనొప్పిగా మారాయని తెలిపారు. అయినప్పటికీ తెలంగాణలోని టి.ఆర్.ఎస్. ప్రభుత్వాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టి ఇరకాటంలో పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా తిరిగి బిజెపికే నష్టాలు తెస్తున్నాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం పగబట్టి తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను పదేపదే ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గరుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మైకు దొరికితే కేంద్రాన్ని తూర్పారబడుతున్న అంశాలన్నీ జనంలోకి వెళ్ళాయని, ఈ పరిణామాలు తెలంగాణలో బిజెపికి నష్టం చేకూరుస్తున్నాయని వివరించారు.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలో బిజెపికి తిరుగులేదని ఎంతో సంబరపడిపోయామని, కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా “కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు
ఇవ్వాల్సిన పైసలన్నీ ఎగ్గొట్టినారంటుగా ” అని సామాన్య ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తలు కూడా అడుగుతున్నారని, ఇది వైరస్ మాదిరిగా ఇంకా మారుమూల పల్లెల్లోకి సైతం వెళుతోందని, అదే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళనగా ఉందని ఆ కమలం పార్టీ నాయకులు అంటున్నారు.
ఐటి, ఈడి దాడులతో ముఖ్యమంత్రి కెసిఆర్ భయపడి తమ దారికి వస్తాడని, తమకు సరెండర్ అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకొన్నామని, కానీ తమ అధిష్టానం ఆశలపై నీళ్ళు చల్లినట్లుగా కెసిఆర్ గోడకు కొట్టిన బంతి మాదిరిగా రివర్స్ అవ్వడం తమకు ಇಬ್ಬಂದಿಗಾ మారిందని అంటున్నారు.
కేంద్రం చెప్పినట్లుగా విననందుకే ఇలా ఈడి, ఐటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని జనం నమ్ముతున్నారని కూడా కమలం పార్టీలోని కొందరు నాయకులు అంగీకరిస్తున్నారు. కేంద్రం విధానాలను తూర్పారబట్టడం…, వాటికి దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు వస్తుండటమే కాకుండా చివరకు బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా కెసిఆర్ వాదనలకు మద్దతు పలుకుతుండటం చూస్తుంటే తమ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందేమోనని ఆ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కేంద్రం విధానాల మూలంగా తెలంగాణ రాష్ట్రానికి 40వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని, ఆ నిధులను కేంద్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వేదికగా కేంద్రంపై దాడి చేసేందుకు టి.ఆర్.ఎస్.ప్రభుత్వం సమాయత్తం చూస్తుంటే తమకు ఏదో కీడు శంకిస్తోందని కమలం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వమే బ్రేకులు వేస్తున్నట్లుగా జనంలో చర్చ జరుగుతోందని అంటున్నారు. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని రద్దు చేయించడానికే కేంద్రం విద్యుత్తు మీటర్లు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోందని, కేంద్రం చెప్పినట్లుగా విననందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని వేధింపులకు గురిచేస్తోందని టి.ఆర్.ఎస్.పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను జనం నమ్ముతున్నారని, ఇదే అంశంపై పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట పొలాల్లో విద్యుత్తు మీటర్లు పెట్టిన అంశాలు సాక్ష్యాలుగా నిలవడంతో టి.ఆర్.ఎస్.పార్టీ నేతల విమర్శలకు బలంచేకూరిందని, ఈ పరిణామాలు పార్టీకి నష్టమేనని అంటున్నారు.
అందుకే ఇప్పటికైనా కేంద్రంలోని పార్టీ పెద్దలు మరీ తెగే వరకూ లాగకుండా కెసిఆర్ తో సర్దుబాటు చేసుకుంటే మంచిదని కూడా ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ టిఆర్ఎస్ పార్టీకి లాభదాయకంగా ఉంటోందని, తమకే నష్టాన్ని కలిగిస్తోందని ఆ నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా పార్టీపెద్దలు పంథా మార్చుకొని తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను సరిదిద్దడమే కాకుండా, అకారణంగా జరుగుతున్న ఈడి, ఐటి దాడులను నిలిపివేయిస్తేనే రాష్ట్రంలో పార్టీకి మేలు జరుగుతుందని, లేకుంటే టి.ఆర్.ఎస్.పార్టీకే మేలు జరుగుతుందని, ఇందులో ఎలాంటి సందేహంలేదని అంటున్నారు. ఇక కమలం పార్టీ పెద్దలు ఇకనైనా పద్దతి మార్చుకుంటారో… లేదో … చూడాలి.
ఇవి కూడా చదవండి….