టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటివలే పార్టీలోని కీలక నేతలు బీజేపీ, వైసీపీలో చేరగా..తాజాగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలోనే వైసిపిలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నిన్న ఆయన ఎపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. వల్లభనేని జగన్‌ను కలవడంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు వల్లభనేని వంశీ.
2006లో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన అనుచరులపై ఇప్పుడు జరిగినన్ని దాడులు ఎప్పుడూ జరగలేదని, నాలుగు నెలలుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చానని అన్నారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక, పార్టీ మారే విషయమై ఆయన స్పందిస్తూ, దీపావళి పండగ తర్వాత చెబుతానని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే వల్లభనేని వంశీ పార్టీ మారడం ఖరారైందని తెలుస్తుంది.
కాగా వల్లభనేని వంశీకి జగన్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్నికల తర్వాత జగన్ చెప్పినట్లు గానే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే గనుక ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పాడు. అదే విధంగా వల్లభనేనితో రాజీనామా చేయించి..గన్నవరం నుంచి అతనిపై పోటీ చేసిన యార్లగడ్డకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక వల్లభనేని వంశీకి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలస్తుంది.