ఏపీలో ప్రస్తుత రాజకీయాలు వాలెంటరీ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా వాలెంటరీ వ్యవస్థను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా మార్చి పారదర్శక పాలన అందిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇక వాలెంటిర్లకు గౌరవ వేతనంగా రూ 5 వేల రూపాయలు ఇస్తున్న సంగతి కూడా విధితమే. నిజానికి వాలెంటరీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వాలెంటర్లు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తూ వచ్చింది. ఇక మొదట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వాలెంటరీ వ్యవస్థపై తీవ్రమైన విమర్శలే గుప్పించారు. .
పవన్ కూడా మొన్నటి వరకు వాలెంటర్లపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వాలెంటరీ వ్యవస్థను రద్దు చేసే అవకాశం ఉందనే టాక్ బలంగానే వినిపించింది. అయితే గతంలో ఈ వ్యవస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు, పవన్ లు.. తీర ఎన్నికల దగ్గర పడే కొద్ది ఈ వాలెంటరీ వ్యవస్థపై సానుకూలంగా స్పందిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వాలెంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారు.
ఇక తాజాగా చంద్రబాబు వాలెంటరీ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో వాలెంటిర్లకు మరింత ప్రాధాన్యత కల్పిస్తామని, జగన్ చేసిన తప్పులకు వాలెంటిలను శిక్షించలేమని చెబుతూ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి నొక్కి చెప్పారు. అయితే చంద్రబాబు ఓట్ల కోసమే వాలెంటరీ వ్యవస్థపై కపట ప్రేమ కురిపిస్తున్నారని, కూటమి అధికారంలోకి వస్తే వాలెంటరీ వ్యవస్థ కచ్చితంగా రద్దవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా ఉన్న వాలెంటర్లు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో వాలెంటిర్ల మద్దతు ఎటువైపు ఉండబోతుందో చూడాలి.
Also Read:భానుడి భగభగ..మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు