ఔషధాలపై పేటెంట్ హక్కుల కంటే క్షయవ్యాధి (టీబీ) రోగులకు చౌకగా చికిత్స అందడమే ముఖ్యమని భావిస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఔషధ నిరోధక టీబీ చికిత్సకు ఉపయోగించే మూడు మందుల కలయికపై పేటెంట్ మంజూరు చేయాలంటూ అంతర్జాతీయ సంస్థ టీబీ అలయన్స్ దాఖలు చేసిన దరఖాస్తును భారత పేటెంట్ కార్యాలయం తిరస్కరించింది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఈ మందుల జనరిక్ వెర్షన్ల తయారీకి, పోటీ పెరగడానికి అవకాశం ఏర్పడవచ్చని ఆరోగ్య హక్కుల కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బీపీఏఎల్ (BPaL) అనేది బెడాక్విలిన్, ప్రిటోమానిడ్, లైనెజోలిడ్ అనే మూడు ఔషధాల కలయిక. ఔషధాలకు లొంగని టీబీతో బాధపడుతున్న అర్హులైన రోగులకు ఈ చికిత్సను అందిస్తారు. పాత చికిత్సా విధానాలతో పోలిస్తే, ఇది ఆరు నెలల్లో చికిత్స పూర్తిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా, దీర్ఘకాలం మందులు వాడాల్సిన అవసరాన్ని, చికిత్స సమయంలో రోగులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది.
భారత్లోని జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం కింద బీపీఏఎల్ మందులకు మోక్సిఫ్లోక్సాసిన్ను జోడించిన బీపీఏఎల్ఎం (BPaLM) చికిత్సను కూడా అర్హులైన రోగులకు అందిస్తున్నారు. టీబీ అలయన్స్ 2018 ఏప్రిల్ 16న ఈ పేటెంట్ దరఖాస్తును సమర్పించింది. అయితే, ఈ మందుల కలయికలో కొత్తదనం లేదని, ప్రత్యేకమైన ఆవిష్కరణగా పరిగణించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ రోగుల హక్కుల కోసం పనిచేసే కార్యకర్తలు, సంస్థలు అభ్యంతరాలు దాఖలు చేశాయి.
Also Read:తులాభారం షూట్లో రవితేజ
ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులను కలిపి ఉపయోగించినంత మాత్రాన కొత్త పేటెంట్ హక్కులు కల్పించకూడదని వారు వాదించారు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన పేటెంట్ కార్యాలయం, భారత పేటెంట్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు లేదని నిర్ధారించింది. అక్టోబర్ 27, 2026న దరఖాస్తును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

