తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, నీటి నిర్వహణలో వైఫల్యం వల్లే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. నాలుగు నెలల ముందే నీటి వినియోగంపై హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీటిని వృథాగా దిగువకు వదిలేశారని విమర్శించారు.
ఏపీలో కరువు పరిస్థితులు లేకుండా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోసి ఏపీ ప్రభుత్వం వ్యవసాయానికి ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. తెలంగాణలో నీటిని ఒడిసిపట్టాలని గతంలో తాము సూచించినా, తమ మాట వినకూడదనే అహంకారంతో నీటిని దిగువకు వదిలేశారని ఆరోపించారు. కృష్ణా నీటిని రేవంత్ రెడ్డి వదిలేస్తే.. చంద్రబాబు నాయుడు 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తొమ్మిది జిల్లాలను ఎండబెట్టారని విమర్శించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందని, ఇప్పుడు రైతులే సెల్ఫ్ డిక్లరేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు సొంతంగా ట్యాంకర్లు తెచ్చుకోవాల్సి వస్తోందని విమర్శించారు. పొలానికి నీళ్లు లేక ట్యాంకర్‌తో నీరు పెట్టుకున్న రైతును సస్పెండ్ చేశారని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. పంటలు ఎండిపోయే, తగలబెట్టుకునే పరిస్థితులను తీసుకొచ్చిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో క్రాప్ హాలిడే, కన్స్ట్రక్షన్ హాలిడే, పవర్ హాలిడే, ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుకు కూడా సెలవు ప్రకటించిందని ఎద్దేవా చేశారు. సింగరేణిలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అక్రమాల వల్లే విద్యుత్ రంగం ఈ పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రభుత్వానికే ప్రజలు సెలవు ప్రకటిస్తే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఒకవైపు కరువు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతూనే.. మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.1.5 లక్షల కోట్ల ఖర్చుకు తెరలేపారని, వేల ఎకరాల భూముల వ్యవహారం బయటపడుతుందనే భయంతో ప్రజల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.
Also Read:ట్రెండింగ్‌లో అభిజిత్ వంజారి!
మూసీ ప్రాజెక్టు బాధితుల కోసం నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రజలు, బాధితులు తమ అభిప్రాయాలు చెప్పకుండా అడ్డుకుంటే పబ్లిక్ హియరింగ్ నిర్వహించడంలో అర్థమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా? అని నిలదీశారు.
మంత్రి కొండా సురేఖ క్షమాపణల అంశంపైనా కేటీఆర్ స్పందించారు. నిజం నిలకడ మీద తేలుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఒక వార్తాపత్రిక క్షమాపణ చెప్పిందని, ఇప్పుడు కొండా సురేఖ కూడా క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మరికొందరు కూడా భవిష్యత్తులో క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని అన్నారు.

