కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేస్తున్న సమయంలోనూ స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నారా? పిల్లలు ఫోన్లు, ట్యాబ్లెట్లతోనే కాలక్షేపం చేస్తున్నారా? అయితే ఇలాంటి అలవాట్లను తగ్గించి కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు పెంచేందుకు ఇటలీలోని కొన్ని రెస్టారెంట్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. భోజనం చేసే సమయంలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టి, కుటుంబంతో ఆనందంగా గడపాలని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది.
ఇటలీలోని సార్డీనియా ద్వీపంలో ‘ఎ తవోలా సెన్జా స్కెర్మి’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని అర్థం స్క్రీన్లు లేకుండా భోజనం చేద్దాం అని. ద్వీపంలోని బాలల హక్కుల సంరక్షణ అధికారి అన్నా కావు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ది గార్డియన్ కథనం ప్రకారం, వచ్చే వారం నుంచి నెల రోజుల పాటు నిర్వహించే ప్రయోగాత్మక కార్యక్రమంలో 15 రెస్టారెంట్లు స్వచ్ఛందంగా పాల్గొననున్నాయి. అనంతరం ఈ కార్యక్రమాన్ని మరిన్ని రెస్టారెంట్లకు విస్తరించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే రెస్టారెంట్లకు వచ్చే కుటుంబ సభ్యులు భోజనం చేసే సమయంలో తమ స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సిబ్బందికి అప్పగించాల్సి ఉంటుంది. వాటికి బదులుగా కుటుంబ సభ్యులు కలిసి సమయం గడిపేందుకు ఉపయోగపడే ప్రత్యేకమైన ‘రీయూనియన్ కిట్’ అందిస్తారు.
ఇటలీ శిశువైద్యుల సమాఖ్య రూపొందించిన ఈ కిట్లో పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఆడుకునే ఆటలు, బొమ్మలు గీయడానికి అవసరమైన సామగ్రి ఉంటాయి. వీటి ద్వారా పిల్లలు తమ రోజువారీ అనుభవాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రోత్సహిస్తారు.
అంతేకాకుండా, డిజిటల్ పరికరాలను అతిగా ఉపయోగించడం వల్ల కలిగే సమస్యల గురించి వివరించే సమాచార పత్రం కూడా ఈ కిట్లో ఉంటుంది. ఇంట్లో సోషల్ మీడియా వినియోగాన్ని ఎలా నియంత్రించుకోవాలో సూచనలు అందులో పొందుపరిచారు. రెస్టారెంట్లలో భోజన సమయానికి అనుగుణంగా పరిమిత వ్యవధిలో ఆడుకునే ఆటలను అందిస్తామని అన్నా కావు తెలిపారు. ఇవి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సంభాషణలు పెంచేందుకు ఉపయోగపడతాయని వివరించారు.
Also Read:కాంగ్రెస్ పార్టీ..స్కామ్ క్యాలెండర్
పిల్లలు ఎక్కువ సమయం ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర డిజిటల్ పరికరాలతో గడపడం వల్ల కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడే సమయం తగ్గుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసే సమయంలో ఫోన్లకు దూరంగా ఉండే అలవాటును ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం.

