వీర జవాన్లకు భారీ రివార్డ్స్…ప్రత్యేక సంక్షేమ నిధి

203
tax exemption to army personnel houses says kcr
- Advertisement -

సైనికుల సంక్షేమం సామాజిక బాధ్యతగా గుర్తించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సైనికుల సంక్షేమంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం…జవాన్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సైనిక సంక్షేమ నిధికి ఇచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు. అవార్డులు పొందిన సైనికులకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.

దేశ సరిహద్దుల్లో నిత్యం కాపలాకాస్తూ.. ప్రజలందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అందుకు సైనికుల త్యాగాలే నిదర్శనం అన్నారు సీఎం కేసీఆర్. భద్రత విషయంలోనూ కాకుండా దేశంలో ఎక్కడ విపత్తు సంభవించినా.. ఆర్మీ తన వంతు బాధ్యతతో ముందుకు వస్తుందన్నారు. పరమవీర చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు రూ. 2.25 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మహావీరచక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి రూ. 1.25 కోట్లు, సర్వోత్తమ అవార్డు పొందిన వారికి రూ. 25 లక్షలు, యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

వరంగల్‌లో సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మాజీ సైనికులు చనిపోతే అతని భార్యకు కూడా రెండు పెన్షన్స్ పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.సర్వీస్ లో ఉండి చనిపోతే సైనికులకు ఎలాంటి పరిహారం అయితే వస్తోందో.. అదే తరహాలో అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా వర్తిస్తుందని తెలిపారు. గురుకుల విద్యా సంస్థల్లో సైనికుల పిల్లలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.

సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం స్కీంలో సైనికులకు 2శాతం కేటాయిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సైనిక సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేస్తామని…రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని.. అమలు చేయని విధంగా సైనిక సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. భారీ నజరానాలతో సైనికులను గౌరవించుకోవటం మన విధి అన్నారు సీఎం కేసీఆర్.

- Advertisement -