క్రిష్‌తో వెంకీ 75

89
krish next with venkatesh 75th Movie

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో విభిన్న దర్శకుడిగా క్రిష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా హిస్టారికల్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణిని తెరకెక్కించాడు. బాలయ్య వందో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శాతకర్ణి…అందరి ప్రశంసలు పొందుతోంది. దీంతో చిత్రయూనిట్‌ సంబరాల్లో మునిగితేలుతోంది. ఇక దర్శకుడు క్రిష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శాతకర్ణితో బాలయ్య కెరీర్‌లోనే ఓ మైలురాయిలాంటి హిట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్రిష్‌…తన నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రస్తుతం వెంకటేష్ ‘గురు’ సినిమా లో న‌టిస్తున్నారు. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్న విక్టరీ వెంకటేష్, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగకీరించాడు. గతంలో రానా, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన వెంకటేష్, త్వరలో క్రిష్ దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఇదీ వెంకీకి 75వ సినిమా కానుంది.

బాలయ్యకు వందో సినిమా మరిచిపోలేని గిఫ్ట్‌గా ఇచ్చిన క్రిష్….వెంకీకి కూడా 75వ సినిమా మైలురాయిగా నిలిచిపోయే హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా సోషల్ ఫాంటసీ కథగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. గతంలో దేవీపుత్రుడు, సాహసవీరుడు-సాగరకన్య లాంటి సినిమాలు చేసి హిట్స్ అందుకున్న వెంకీ…. ఇప్పుడీ హీరో మరోసారి ఆ జానర్ లో ప్రేక్షకులను అలరించనున్నాడు.