తీవ్ర తుఫానుగా మారనున్న తౌక్టే..

72
Tauktae

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తౌతే ఈ నెల 18వ తేదీ వేకువజామున గుజరాత్ లోని పోరుబందర్-మహువా ప్రాంతాల మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ పేర్కొంది. ఇది పెను తుపానుగా తీరం దాటనుండడంతో అనేక జిల్లాలకు ఉప్పెన తాకిడి తప్పదని హెచ్చరించింది.

ప్రస్తుతం అతి తీవ్ర తుపానుగా కొనసాగుతున్న తౌతే గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. ఆపై ఉత్తర వాయవ్య దిశగా పయనించి గుజరాత్ తీరాన్ని సమీపిస్తుంది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు వీస్తాయని, అలలు 3 మీటర్ల ఎత్తున ఎగసిపడతాయని ఐఎండీ తాజా బులెటిన్ లో వివరించింది. సౌరాష్ట్ర, కచ్, డయ్యూ ప్రాంతాల్లో మే 17న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మే 18న కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి చోటుచేసుకుంటుందని వెల్లడించింది.