భారతీయ జనతా పార్టీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారతీయుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ జాతి వివక్ష చూపే దేశం కాదంటూనే జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.. ఆఫ్రికా విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి ద స్ట్రీమ్ అనే ఆఫ్రికన్ చానెల్‌తో మాట్లాడుతూ.. దక్షిణ భారతీయుల పట్ల అనుచితంగా మాట్లాడారు. మా దేశంలోనూ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలు నల్లగా ఉంటారు. అయినా వాళ్లను మేము అంగీకరిస్తున్నాముగా అంటూ తరుణ్ నోరు జారారు.
I said we worship Krishna, which literally em,ans black, we were the first to oppose any racism and were in fact victims of racist British https://t.co/kjSBSNl9w8
— . (@Tarunvijay) April 7, 2017
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో తన తప్పు తెలుసుకున్న తరుణ్.. ట్విట్టర్‌లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేము కృష్ణున్ని పూజిస్తాం అంటే నలుపును గౌరవిస్తామనే నేను చెప్పాను. నిజానికి జాతి వివక్షను మొదట వ్యతిరేకించింది భారతే. మేమే బ్రిటిష్ జాతి వివక్షకు బాధితులమయ్యాం అని తరుణ్ ట్వీట్ చేశారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తరుణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఖుష్బూ సుందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇవి తెలివిలేని మాటలని, తరుణ్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని ఆమె అన్నారు. డీఎంకే నేత కనిమొళి మాట్లాడుతూ.. ఇవి జాతి వ్యతిరేక వ్యాఖ్యలని అన్నారు. ఆయనపై బీజేపీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.