జేబులో తుపాన్ పేరిట శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని ప్రచురించి, పల్లకి లో మోయడాన్ని విమర్శించిన వసంత మేఘం పత్రిక కు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిదీటుగా సమాధాన మిచ్చారు. శ్రీశ్రీ ని ఎంత కాలమైనా ఇలాగే మోస్తామని, ఎంత కాలమైనా శ్రీశ్రీ కీర్తి మసకబారదని ఉద్ఘాటించారు. శ్రీశ్రీ మీ ఒక్కరి సొత్తేమీ కాదని భూమన పేర్కొన్నారు. దీంతో అదే సమయంలో భూమన వ్యాఖ్యలను సినీ ప్రముఖ నటులు తనికెళ్ల భరణి స్వాగతిస్తూ…శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తూ, ఇలాగే మోస్తూనే ఉంటాం, అందులో సందేహమేమీ లేదంటూ సమర్థించారు. ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి తో ఓ సాయంత్రం….కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక ఆఫీసర్స్ క్లబ్ లో జరిగింది. శ్రీశ్రీ పుస్తకాన్ని భూస్వాములు మోసారంటూ వసంత మేఘం ప్రచురించిన విమర్శలకు ఈ వేదిక మీద నుంచే భూమన జవాబిచ్చారు. ఈ క్రమంలోనే బాపు గీసిన బొమ్మతో ప్రచురించిన చేతిలో శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని ఇదే వేదిక మీద మరో సారి తిరిగి ఆష్కరించారు. ఈ సందర్బంగా తనికెళ్ల భరణి ఆహూతులతో మమేకమయ్యారు.
శ్రీ కృష్ణ దేవరాయలు సాహిత్య సమరంగుడు అయితే భూమన కరుణాకర రెడ్డి కూడా ఆయన అంశతో జన్మించారని అన్నారు. తిరుపతిలో అత్యద్భుతంగా తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన గొప్ప సాహితీ ప్రియుడని ప్రశంసించారు. సాహిత్య, రాజకీయాలను రెండు పార్శ్వాలుగా కలిగిన అరుదైన వ్యక్తి భూమన అని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, గురజాడ కన్యా శుల్కం రెండూ అద్భుత కళాఖండాలుగా చిరకాలం నిలిచిపోతాయని అన్నారు. తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశం గా నిలుస్తాయన్నారు.
మిథునం సినిమా చేయడం తన పూర్వజన్మ సుకృతమని ఆహూతులు అడిగిన ఓ ప్రశ్నకు తనికెళ్ల బదులిచ్చారు. కమర్షియల్ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్న రోజుల్లో మళ్లీ మిథునం లాంటి కథా చిత్రాలను ఆశించలేమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తనికెళ్ల భరణిని భూమన కరుణాకర రెడ్డి ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో రాయల సీమ అధ్యయనాల సంస్థ కన్వీనర్ భూమన్, తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి, కార్యదర్శి బాబూరావు, మానవ వికాస వేదిక కన్వీనర్లు శైల కుమార్, సాకం నాగరాజు, సాహితీ ప్రముఖులు దుర్గాప్రసాద్, మస్తానమ్మ, బొందు రామచంద్రా రెడ్డి, చంద్రా రెడ్డి, ధర్మయ్య కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కుంట్రపాకం నరసింహా, కో ఆప్షన్ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి పాల్గొన్నారు.