ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచడం, అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను సమర్పిస్తేనే పదోన్నతులకు (ప్రమోషన్లకు) అర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఆస్తి వివరాలు వెల్లడించని వారిని పదోన్నతి జాబితా నుంచి మినహాయించనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ స్థిర, చరాస్తులు, పొదుపులు, అప్పులు మరియు బకాయిల వివరాలను ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం (సిఎస్) ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులు తమ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (IFHRMS) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగులు కేవలం తమ పేరిట ఉన్న ఆస్తులనే కాకుండా, ఇతరుల పేరుతో (బినామీగా) కొనుగోలు చేసిన ఆస్తులు, రుణాల వివరాలను కూడా తప్పనిసరిగా బయటపెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read:జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు..కేటీఆర్ దిశానిర్దేశం
సరియైన సమయానికి ఆస్తి వివరాలు సమర్పించని ఉద్యోగులను ప్రమోషన్ల జాబితాలో చేర్చబోమని, అంతేకాకుండా వారిని ‘ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నిబంధనలను ఉల్లంఘించినవారు’గా పరిగణించి శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సీఎస్ తన ఉత్తర్వుల్లో హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచేందుకు తమిళనాడు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

