సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానుల ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఓ వైపు రజినీ కొత్త పార్టీ పెడతారని ఆయన సోదరుడు ఇప్పటికే ప్రకటించినప్పటికీ… రజనీ నుంచి మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తన అభిమానులతో ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన రజనీకాంత్ ఇంత వరకు స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. అయితే తమిళ తలైవా రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరగుతోంది. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? లేదా అనే అంశం గురించి ఆయన అభిమానులతోపాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే రజినికాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో..రజినికి ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురౌతూనే ఉన్నాయి. రజినీ రాజకీయాల్లోకి వస్తే..రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింటుందని, అసలు రజిని రాజకీయాలకు పనికిరాడని ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు రజినీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
అటు రాజకీయ నాయకుల నుంచే కాకుండా..సినీ పరిశ్రమ నుంచికూడా తమిళ తలైవాకు విమర్శలు తప్పలేదు. ఇదే క్రమంలో తాజాగా రజినీ పొలిటికల్ ఎంట్రీ పై తమిళ ప్రముఖ సినీ దర్శకుడు టి. రాజేందర్ తీవ్రస్థాయిలో స్పందించారు.
జీఎస్టీ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, ధియేటర్ల యజమానులతో పాటు చిత్రపరిశ్రమ ప్రముఖులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, జీఎస్టీతో తమిళసినీ పరిశ్రమ నాశనమవుతుందని అన్నారు. జీఎస్టీపై రజనీకాంత్ స్పందించకపోవడం దురదృష్టకరమని, సినీ పరిశ్రమ గురించి ఆలోచించని రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏం మంచి చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
అసలు రజినీకాంత్ కు రాజకీయాల్లోకి వచ్చే దమ్ము లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇక..ఇప్పటికే జీఎస్టీ పన్ను విధానం వల్ల సినీ పరిశ్రమకు ఇబ్బందులుంటాయని కమల్ హాసన్ అన్నారు. అంతేకాకుండా సినిమాలపై జీఎస్టీ పన్ను తగ్గించకపోతే తాను చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని కూడా కమల్ వెల్లడించిన విషయం తెలిసిందే.