పద కవితా పితామహుడు అన్నమయ్య..

10
- Advertisement -

అచ్చ తెలుగు పదాలతో కీర్తనలు రచించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన అన్నమయ్య పద కవితా పితామహుడిగా నిలిచారని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రామ సూర్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి.

ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన డా|| రామ సూర్యనారాయణ ”తాళ్లపాక కవులు – పద కవిత్వం” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య పద కవిత పితామహుని తెలిపారు. అదేవిధంగా అన్నమయ్య సతీమణి తిమ్మక్క సుభద్ర కళ్యాణం, కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు ద్విపదలో హరివంశము, మనువడు చిన్నన్న ఉషా పరిణయం, అన్నమయ్య చరిత్ర వంటి ద్విపద కవితలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా, గొప్పవైన సాహిత్య విలువలతో రాశారన్నారు. వంశమంతా కవులైన ఖ్యాతి తాళ్లపాక వంశానికి చెందుతుందన్నారు. బహు భాషా పండితుడైన అన్నమయ్య పదకవిత్వాన్ని భక్తిపథ కవిత్వంగా మార్చారని వివరించారు.

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ మలయ వాసిని ‘ అన్నమయ్య కీర్తనలు – వస్తు వైవిధ్యం ‘ అనే అంశంపై ప్రసంగిస్తూ, అన్నమయ్య మధుర భక్తితో వస్త్రాశ్రయ సాహిత్యం, ఆత్మాశ్రయ సాహిత్యం అనే రెండు అంశాలతో తన సంకీర్తనలను రచించినట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలను ఆధ్యాత్మిక విభాగంలో నాలుగు సంపుటాలు, శృంగారం విభాగంలో 22 సంపుటాలుగా విభజించినట్లు చెప్పారు. ఉత్తర భారత దేశంలో 14, 15, 16వ శతాబ్దాలలో సఖి సాంప్రదాయం వచ్చిందని సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాధాదేవిని సేవించినట్లు తెలిపారు. అదేవిధంగా సఖి సాంప్రదాయాన్ని అన్నమయ్య స్వీకరించి తనను అమ్మవారికి సఖిగా భావించి, శ్రీవారితో మమేకమై శృంగార కీర్తనలను రచించినట్లు వివరించారు.

Also Read:6వ దశ ఎన్నికల పోలింగ్‌..అప్‌డేట్

- Advertisement -