హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలకి రాష్ట్రం నుండే కాదు విదేశాల నుండి భాషాభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం రోజు ఇండస్ట్రీకి సంబంధించి స్టార్ హీరోలతో పాటు కవులు, రచయితలు, భాషాభిమానులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. మహాసభల నిర్వహణపై ఆనందాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితోపాటు తెలుగు భాష అభివృద్ధికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేస్తున్న కృషిని సినీ ప్రముఖులు మనస్ఫూర్తిగా ప్రశంసించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ తెలుగు మహాసభల గురించి మెగా హీరో అల్లు అర్జున్ తనదైన శైలిలో స్పందించారు.. ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందని ప్రశంసించాడు. తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటి చెప్పేందుకు ప్రభత్వం నిర్వహించిన కార్యక్రమం అత్యద్భుతమని ట్వీట్ చేశాడు. టీఎస్ ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పాడు. తెలుగు మహాసభలు విజయవంతం కావడం ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు.
ఇక ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంతోపాటు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను సన్మానించినందుకు సీనియర్ సినీనటుడు కృష్ణంరాజు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ ప్రముఖులందరూ హాజరైన వేడుకకు తాను హాజరుకాకపోవడం కేవలం సమాచార లోపమేనని, మరే ఇతర కారణాలు లేవని ఆయన ఒక పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం విన్నాను. కృష్ణదేవరాయ పాత్ర పోషించిన నాకు. అష్టదిగ్గజాల సమేతంగా స్వయంగా పండితుడై తెలుగు భాషను అత్యున్నత శిఖరాలకు చేర్చిన కృష్ణదేవరాయలు కేసీఆర్‌లో కనిపించారు.

కేసీఆర్ వేల పుస్తకాలు, పద్యాలు చదివారని నాకు తెలుసు. అందుకే తెలుగుభాష మీద ఆయనకున్న పట్టు ఏమిటో ప్రారంభోపన్యాసంలోనే కనిపించింది. తెలుగుభాష మీద కేసీఆర్‌కు ఎంతటి అభిమానం ఉందో మహాసభల నిర్వహణలో, భాషను ప్రపంచవ్యాప్తం చేయడంలో కనిపించింది. బ్రహ్మాండంగా తెలుగు మహాసభలను నిర్వహించిన కేసీఆర్‌కు, యువనేత కేటీఆర్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ స్ఫూర్తితో ప్రతి తెలుగువాడు తెలుగుజాతిని, తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయటానికి కృషిచేస్తారని కోరుకుంటున్నా అని కృష్ణంరాజు ఆకాంక్షించారు.
I whole heartedly appreciate this wonderful initiative taken by the government to promote Telugu literature & culture with Prapancha Telugu Mahasabhalu Program . Really Proud & Elated pic.twitter.com/qhiXQctCpW
— Allu Arjun (@alluarjun) December 20, 2017

