జలమండలిని ముట్టడిస్తాం:తలసాని

3
- Advertisement -

నగరంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సనత్ నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని ఆయన హితవు పలికారు. నగర ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి ఒక డెడ్‌లైన్ విధించారు. రాబోయే జూన్ 5 లోగా నగరంలోని నీటి సమస్యలపై ప్రభుత్వం స్పందించి, శాశ్వత పరిష్కారం చూపించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జలమండలి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పరిపాలనా తీరును తప్పుబడుతూ.. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపడుతున్న విధానంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత బాధ్యతాయుతంగా, పకడ్బందీగా నిర్వహించాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రభుత్వం స్వీపర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులతో చేపట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఇలాంటి కీలకమైన బాధ్యతలను కింది స్థాయి సిబ్బందికి అప్పగించడం వల్ల ఓటర్ల జాబితాలో అనేక తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, ఇది ఎంతమాత్రం సరికాదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమర్థులైన అధికారులతో ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అలాగే నగరంలో నీటి ఎద్దడి రాకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

- Advertisement -