అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతున్న ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థకు అమెరికాలో ఒక ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘న్యూ గ్లెన్’ రాకెట్ ప్రయోగ పరీక్షల్లో ఘోర ప్రమాదం జరిగింది. రాకెట్ ఇంజిన్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన ‘హాట్‌ఫైర్’ పరీక్షలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
న్యూ గ్లెన్ రాకెట్‌ను త్వరలోనే నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా రాకెట్‌ను లాంచ్ ప్యాడ్‌కు అమర్చి, భూమికి కట్టి ఉంచి.. దాని ఇంజిన్లను మండించి చూసే హాట్‌ఫైర్ పరీక్షను రాత్రి 9 గంటల సమయంలో ప్రారంభించారు. ఇంజిన్లు స్టార్ట్ అయిన కొద్ది క్షణాల్లోనే రాకెట్ కింది భాగంలో సాంకేతిక లోపం (అనామలీ) తలెత్తింది.
చూస్తుండగానే 188 అడుగుల పొడవైన రాకెట్ మొదటి భాగం కుప్పకూలిపోయింది. అందులోని ద్రవ మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్ ఇంధనం ఒక్కసారిగా భగ్గుమనడంతో రాకెట్ మొత్తం పేలిపోయింది. దీంతో రాత్రి వేళ ఆ ప్రాంతమంతా భారీ అగ్నిగోళంలా మారిపోయింది. మైళ్ల దూరం వరకు ఈ మంటలు, దట్టమైన పొగలు స్పష్టంగా కనిపించాయి. ఈ పేలుడు ధాటికి లాంచ్ ప్యాడ్ 36 తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. దీనిపై బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ స్పందిస్తూ.. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, అప్పుడే దర్యాప్తు ప్రారంభించాం. ఈ రోజు మాకు చాలా కష్టమైన రోజు. ఏది ఏమైనా దెబ్బతిన్న వాటిని మళ్లీ నిర్మించి, తిరిగి రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతాం అని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.
Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

