మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం..

236
Talasani Srinivas yadav
- Advertisement -

ఈ నెల 31న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉచిత చేపపిల్లల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం చేపపిల్లల విడుదల కార్యక్రమం ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం సచివాలయంలోని తన చంబర్‌లో మత్స్యశాఖ కమీషనర్‌ సువర్ణ, ఇతర మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రాతినిద్యం వహిస్తున్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఘన్‌పూర్‌ చెరువులో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ స్పీకర్‌తో కలిసి చేపపిల్లలను విడుదల చేస్తారు.

Talasani Srinivas Yadav

అనంతరం టూరిజం శాఖ మంత్రి చందులాల్‌తో కలిసి ములుగు నియోజకవర్గంలోని రామప్ప చెరువులో చేపపిల్లలను విడుదల చేయాలని సమావేశం నిర్ణయించారు. ఈ సంవత్సరం 21,568 చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌లలో 75.80 కోట్ల చేపపిల్లలను విడుదల చేయాలని నిర్ణయించడం జరిగిందని మంత్రి వివరించారు. అదేవిధంగా 23 రిజర్వాయర్లలో 4.07 కోట్ల రొయ్యపిల్లలను విడుదల చేయడం జరుగుతుందన్నారు. చేపపిల్లల విడుదల సమయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. చేపపిల్లల నాణ్యత విషయంలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేయాలన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు, మత్స్య సొసైటీల సభ్యుల సమన్వయంతో విడుదల చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజెప్పడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు చేపలను విక్రయించుకునేందుకు గాను మత్స్యకారులకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అబ్ధిదారులకు సబ్సీడీపై వాహనాలను ఆగస్టు నెలఖరు నాటికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులు ఆదేశించారు.

Talasani Srinivas yadav

మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నూతన విధానాన్ని అమలులోకి తేవడం జరుగుతుందని ఆయన చెప్పారు. మత్స్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారలను అందిస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించి పెట్టుబడిదారులకు అనువుగా ఉండే స్థలాలను గుర్తించడానికి ఫుడ్‌ప్రాసెసింగ్‌ శాఖ వారితో సమన్వయపర్చుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యరంగంలో ప్రైవేటు భాగస్వామ్యం వలన చేపల పెంపకంలో మత్స్యకారులకు నూతన విధానాలపై అవగాహన కల్సించడం జరుగుతుందని అన్నారు. మత్స్యరంగంపై ఆధారపడి లక్షలాది మత్స్యకారుల కుటుంబాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -