సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర అంగరంగవైభవంగా జరుగుతోంది. నెత్తిన బోనం ఎత్తి, మనసంతా అమ్మవారిని స్మరిస్తూ తరలివచ్చిన భక్తజనంతో లష్కర్ పోటెత్తింది. దివ్యమంగళ స్వరూపంగా అమ్మవారు దర్శనమివ్వగా బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం వైభవంగా జరిగింది.
పచ్చి కుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని తనలోకి ఆవాహన చేసుకుని భవిష్యవాణిని వినిపించింది. తనను బాగా చూసుకుంటున్న వారిపై తన కరుణ ఉంటుందని, ఒకరిని తక్కువగా, ఒకరిని ఎక్కువగా చూడనని, తక్కువ సేవ చేసినా, ఎక్కువ సేవ చేసినా, అందరూ తన బిడ్డలేనని స్వర్ణలతను ఆవహించిన అమ్మవారు పలికింది. తన వద్దకు వచ్చే వారు చాలా
కష్టాల్లో ఉన్నారని..దుఖంతో వస్తున్నారని తెలిపింది.ఆడపడుచులందరూ శోభిస్తు వెళ్తున్నారని చెప్పింది.
తన ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లేలా చూస్తానని, ఎటువంటి ఆపదా రానివ్వకుండా చూసుకుంటానని వరమిచ్చింది. న్యాయం ఉన్నంత వరకు న్యాయం పక్షానే నిలబడతానని…న్యాయానికి పాటుపడే ఉజ్జయిని మహంకాళినని తెలిపింది. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్షిస్తానని చెప్పింది. రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని, పాడి పంటలు బాగుంటాయని సెలవిచ్చింది.