కోల్‌కతాలోని శతాబ్దాల నాటి కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి చేప ప్రసాదాన్ని స్వీకరించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని శాక్త సంప్రదాయంలో కౌశికి అమావాస్యను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ సందర్భంగా కాళీఘాట్ ఆలయాన్ని దర్శించుకున్న సువేందు అధికారి, నేలపై కూర్చుని కాళీఘాట్ ఆలయ సంప్రదాయ ప్రసాదమైన పెద్ద చేప తల, వేయించిన చేప (ఫిష్ ఫ్రై), మరియు బసంతి పులావ్‌లను స్వీకరించారు.
దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారం తీసుకోకూడదని, పూజల సమయంలో మాంసాహారం తినే వారిని “పాషాండులు” (పాపిష్టులు) అని భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి (భాగేశ్వర్ బాబా) చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. దుర్గాపూజ సమయంలో బెంగాల్‌లో మాంసం, మద్యం షాపులను మూసివేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దుర్గాపూజ సమయంలో మాంసాహారం తినడమే కాకుండా, అమ్మవారికి కూడా నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉన్న బెంగాలీ ప్రజలలో ఈ వ్యాఖ్యలు తీవ్ర అసంతృప్తిని రాజేశాయి.సాధారణంగా ఉత్తరాది శాకాహార అలవాట్లను బెంగాల్‌పై రుద్దుతున్నారనే విమర్శలను బిజెపి తిప్పికొడుతూ వస్తోంది. ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలపై ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో బిజెపి వేగంగా స్పందించింది. బిజెపి బెంగాల్ అధ్యక్షుడు శమీక్ భట్టాచార్య మాట్లాడుతూ— “ఏ ఆధ్యాత్మిక వేత్తా బెంగాల్ ప్రజలు ఏం తినాలో నిర్ణయించలేరు. బెంగాలీలు చేపలు, మాంసం తింటారు. స్వామి వివేకానంద కూడా బెంగాలీలు మాంసాహారం తినడాన్ని సమర్థించారు” అని స్పష్టం చేశారు.
అటు ధీరేంద్ర శాస్త్రికి స్వాగతం పలికిన సువేందు అధికారి, మరోవైపు బెంగాల్ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆలయంలోని చేప ప్రసాదాన్ని స్వీకరించి సమతుల్యతను పాటించారు.ఈ విషయంపై సువేందు స్పందిస్తూ— ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. నేను సనాతన హిందువును. మహాష్టమి రోజున కార్తీక మాసంలో నేను సాత్వికాహారమే తింటాను. అదే సమయంలో కాళీ మాతకు నైవేద్యంగా సమర్పించే మేక మాంసం, చేపల ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తాను. ఈ రోజు ఆలయంలో సమర్పించిన చేప ప్రసాదాన్ని తిన్నాను అని తెలిపారు.
Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!
సువేందు అధికారి కాళీఘాట్‌లో చేప ప్రసాదం తింటున్న వీడియో ఆధారంగా బిజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ…ఈ వివాదం ఇక్కడితో ముగియాలి. కాళీఘాట్‌లో బిజెపి నాయకుడు సువేందు అధికారి కాళీమాత సాంప్రదాయ చేప ప్రసాదాన్ని స్వీకరించి బెంగాల్ విశ్వాసాలు, సంస్కృతి పట్ల గౌరవాన్ని చాటారు. బిజెపి ఎప్పుడూ బెంగాల్ సంప్రదాయాలు మరియు ప్రయోజనాల వైపే నిలబడుతుంది అని పేర్కొన్నారు.
బెంగాలీ సంస్కృతిలో నిత్య జీవితంతో పాటు ఆధ్యాత్మికతలోనూ చేపలు, మాంసానికి ప్రత్యేక స్థానం ఉంది. దుర్గాపూజ వేడుకల్లో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది, కాబట్టి ఆహారపు అలవాట్లపై వచ్చిన ఈ వివాదాన్ని సువేందు అధికారి తన చర్యల ద్వారా తెలివిగా పరిష్కరించే ప్రయత్నం చేశారు.

