హిందూ మతం నుంచి మరో మతంలోకి మారినంత మాత్రాన గతంలో ఉన్న సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తికి, గతంలో ఉన్న సామాజిక స్థితి ఆధారంగా వెనుకబడిన తరగతి హోదాను స్వయంచాలకంగా కల్పించలేమని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మతం మారిన తర్వాత కూడా పాత మతంలో ఎదుర్కొన్న సామాజిక వెనుకబాటుతనాన్ని అదే విధంగా కొత్త మతంలోకి బదిలీ చేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద రిజర్వేషన్ ప్రయోజనాలను కోరేందుకు, మత మార్పిడికి ముందు ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని మాత్రమే ఆధారంగా చూపలేరని స్పష్టం చేసింది.హిందూ సామాజిక వ్యవస్థ నుంచి హిందూయేతర సామాజిక వ్యవస్థలోకి మారిన వ్యక్తి.. మత మార్పిడికి ముందు ఉన్న సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద ప్రత్యేక ప్రయోజనాలను కోరలేరు అని ధర్మాసనం పేర్కొంది.
మతం మారడానికి ముందు ఉన్న సామాజిక వ్యవస్థలో ఎదుర్కొన్న వెనుకబాటుతనం ఆధారంగా, కొత్త మతంలోనూ వెనుకబడిన తరగతి హోదాను స్వయంచాలకంగా పొందలేరని వివరించింది.ఈ సందర్భంగా రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు, 1950ను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ ఉత్తర్వు ప్రకారం షెడ్యూల్డ్ కులాల హోదాకు సంబంధించిన ప్రయోజనాలు పొందే విషయంలో మతపరమైన అర్హతలు వర్తిస్తాయని పేర్కొంది. సంబంధిత నిబంధనల ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలకు చెందినవారికే షెడ్యూల్డ్ కులాల హోదా వర్తించే అంశాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.
సమీర్ అహ్మద్ అనే వ్యక్తి 2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారారు. ఆయన మత మార్పిడిని 2016లో గెజిట్లో ప్రకటించారు. అనంతరం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు తనను ‘ముస్లిం లెబ్బై’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తూ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తహసీల్దార్ను కోరారు.
అయితే, ఆయన అభ్యర్థనను తహసీల్దార్ తిరస్కరించడంతో సమీర్ అహ్మద్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ధర్మాసనం సమీర్ అహ్మద్ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి తరఫున అప్పీల్ దాఖలైంది. తాజాగా సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును సమర్థించడంతో, మత మార్పిడి అనంతరం రిజర్వేషన్ ప్రయోజనాలు కోరే విషయంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read:ఢిల్లీ నిరసనలు..అరెస్టులపై పిటిషన్లు

