పాక్‌ ఉగ్రవాదంపై రాజ్‌నాథ్‌ ఫైర్

8
- Advertisement -

పాకిస్థాన్‌ నుంచి మరో ఉగ్రవాద చర్యకు పాల్పడితే.. గతంలో ఇచ్చిన ప్రతిస్పందన కంటే మరింత తీవ్రంగా బదులిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. భారతదేశం శాంతిని కోరుకునే దేశమే అయినప్పటికీ.. ఆ నిబద్ధతను బలహీనతగా భావించకూడదని స్పష్టం చేశారు. శాంతిని కాపాడటానికి బలం, సామర్థ్యం కూడా అవసరమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన టైమ్స్ నెట్‌వర్క్ నేషనల్ డిఫెన్స్ కాన్‌క్లేవ్‌ 2026లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశ నాగరికత, సాంస్కృతిక విలువలు చర్చలు, సహజీవనం, శాంతియుత పరిష్కారాలకు ప్రాధాన్యం ఇస్తాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే, దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.

2016లో ఉరీ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌, 2019లో పుల్వామా దాడి తర్వాత బాలాకోట్‌లో చేపట్టిన వైమానిక దాడులను ఆయన గుర్తుచేశారు. గత ఏడాది పహల్గామ్‌లో పౌరులపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

భారత భూభాగంలో రక్తపాతం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించిన ప్రతిసారీ దేశం తగిన సమాధానం ఇచ్చిందని ఆయన అన్నారు. గతంలో చేపట్టిన సైనిక చర్యల ప్రభావం ఇప్పటికీ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారికి గుర్తుండే ఉంటుందని వ్యాఖ్యానించారు.2014 నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత భద్రతా దళాల పనితీరులో గణనీయమైన మార్పు వచ్చిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. భారత్‌పై ఆయుధాలు ఎత్తుకున్న చాలా మంది ఉగ్రవాదులు ఏడాది లోపే భద్రతా దళాల చర్యల్లో హతమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వ్యక్తిగత ధైర్యం, మానవత్వానికి ఉన్న ప్రాధాన్యాన్ని కూడా రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. ద్వేషం, ఉగ్రవాదం ఎంత బలంగా ఉన్నప్పటికీ.. మానవత్వంపై విశ్వాసం కలిగిన వ్యక్తి సంకల్పం వాటిని ఓడించగలదని అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యసాహసాలను ప్రశంసించారు.

ALso Read:ఢిల్లీ నిరసనలు..అరెస్టులపై పిటిషన్లు

- Advertisement -