కేంద్రంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు..!

253
farmers protest
- Advertisement -

కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకువచ్చిన నూతన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాలు రోజురోజుకీ ఉధృతమవుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. జనవరి 11 న నూతన వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మోదీ సర్కార్‌కు చివాట్లు పెట్టింది.. నూతన చట్టాలను మీరు నిలుపుదల చేస్తారా? లేదంటే మమ్మల్ని చేయమంటారా? అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రైతులు నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా…మీకు ఇంత అహం ఎందుకు? అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది.

ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మా చేతులకు రక్తం అంటుకోవాలని మేం భావించడం లేదు. ఆందోళనల్లో పాల్గొన్న కొంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా పాల్గొంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని కడిగిపారేసింది. అలాగే రైతుల ఆందోళన నేపథ్యంలో ఈ చట్టాలను కొంత కాలం నిలిపివేయగలరా అంటూ కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. రైతుల ఆందోళనలను కేంద్రంలోని మోదీ సర్కార్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయిందని, అందుకే తామే ఓ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ బోబ్డే తేల్చిచెప్పారు. ప్రస్తుతం రాజధానిలో జరుగుతున్న సంఘటనకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని సుప్రీం ధర్మాసనం కేంద్రానికి చెప్పింది.

సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న ప్రక్రియపై తాము అసంతృప్తిగా ఉన్నామని, కేంద్రం నిర్వహిస్తున్న చర్చల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసి, రైతుల అభిప్రాయం తెలుసుకోవాలని సుప్రీం సూచించింది. వ్యవసాయ బిల్లులపై సుప్రీం స్టే ఇస్తే రైతులు ఆందోళనలను విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల అమలుపై ఓ కమిటీ వేసి, తుది నివేదిక వచ్చేవరకు చట్టాల అమలును నిలిపివేయాలని న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకరించి అప్పటి వరకు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తామని అంటే మాత్రం వెంటనే రైతులు కూడా ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. ఒక వేళ కేంద్రం నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయకపోయినా..సుప్రీంకోర్టు స్టే ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు కాస్త ఘాటుగానే స్పందించింది అని చెప్పాలి. మరి సుప్రీం కోర్టు స్టే ఆర్డర్స్ ఇస్తే కేంద్రం ఎలా వ్యవ‍హరిస్తుందో చూడాలి.

- Advertisement -