ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌..

192
Supreme Court
- Advertisement -

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల వాయిదా వేయలేమని, ఏపీలో స్థానిక ఎన్నికలు యథావిధిగా జరపాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాయిదా కోరుతూ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం కొట్టివేసింది. ఏపీ సర్కారు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోందని, పోలీసులు వ్యాక్సిన్ భద్రతా విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గోవాతో పాటు అనేక రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని వివరించారు.

దీనిపై ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ… దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా..? ఏపీలోనే ఎందుకు నిలిపివేయాలని కోరుతున్నారు? అంటూ ప్రశ్నించింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో ఎన్నికలు కావాలని కోరి, వైరస్ ప్రభావం తగ్గినవేళ ఇప్పుడెందుకు వద్దంటున్నారు? అంటూ నిలదీసింది. ఏదో ఒక సాకుతో ఎన్నికలు నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎస్ఈసీపై మీ రాతలే మీ అభిప్రాయాలను, మీ ఆలోచనా తీరును తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల సంఘం ప్రధాన విధి అని, ఈ కార్యనిర్వహణలో కోర్టులను జోక్యం చేసుకోవాలని కోరడం సబబు కాదని జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. తాజా తీర్పుతో ఏపీ పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు తొలగినట్టయింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన దరిమిలా ఇక నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోనుంది.

- Advertisement -