మహిళలకు నెలసరి సెలవులు..ఉద్యోగాలపై ప్రభావం!

5
- Advertisement -

మహిళలకు నెలసరి సెలవులు కల్పించే జాతీయ విధానం రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (PIL) సుప్రీం కోర్టు శుక్రవారం స్వీకరించడానికి నిరాకరించింది. ఈ విషయంపై విచారణ సందర్భంగా, ఇలాంటి విధానం చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడానికి సంస్థలు ముందుకు రాకపోవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి నిబంధనలు అనుకోకుండా లింగ వివక్షకు సంబంధించిన భావాలను మరింత బలపరిచే అవకాశం ఉందని కూడా కోర్టు పేర్కొంది.

అయితే సంబంధిత అధికార సంస్థలు అన్ని వర్గాలతో చర్చించి, మహిళలకు నెలసరి సెలవులపై ఒక విధానం రూపొందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని కోర్టు సూచించింది.

ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ ..ఇలాంటి పిటిషన్లు కొన్నిసార్లు మహిళలను తక్కువగా చూపించే భావనను సృష్టించవచ్చు. నెలసరి అనేది చెడు విషయం అన్న భావనను పెంచేలా అవుతాయి. ఇది ఒక హక్కు అయినప్పటికీ, ఉద్యోగదాతల దృష్టిలో చెల్లింపు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలి అని అన్నారు.

పిటిషన్ దాఖలు చేసిన శైలేంద్ర మణి తిరుపతి తరఫున సీనియర్ న్యాయవాది ఎంఆర్ షెంషాద్ వాదనలు వినిపించారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకున్నాయని, ముఖ్యంగా కేరళలో పాఠశాలల్లో నెలసరి సమయంలో విద్యార్థినులకు ప్రత్యేక సడలింపులు ఇవ్వడం ప్రారంభించారని ఆయన తెలిపారు. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా మహిళా ఉద్యోగులకు ఇలాంటి సెలవులు అందిస్తున్నాయని చెప్పారు.

దీనికి స్పందించిన సీజేఐ సూర్యకాంత్, స్వచ్ఛందంగా ఇలాంటి విధానాలు అమలు చేయడం మంచిదే కానీ వాటిని చట్టపరంగా తప్పనిసరి చేస్తే సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు. స్వచ్ఛందంగా ఇవ్వడం చాలా మంచిది. కానీ చట్టం ద్వారా తప్పనిసరి చేస్తే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడంలో సంస్థలు వెనుకడుగు వేయవచ్చు. న్యాయవ్యవస్థలో గానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో గానీ అవకాశాలు తగ్గిపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

Also Read:‘పెద్ది’..క్రేజీ అప్‌డేట్

ఇలాంటి నిబంధనలు కార్యాలయాల్లో మహిళలపై ఉన్న అభిప్రాయాలను ప్రభావితం చేయడమే కాకుండా వారి వృత్తి అభివృద్ధిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

- Advertisement -