ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ..

184
supreme court
- Advertisement -

ఢిల్లీలో వాయుకాలుష్యంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం…ఢిల్లీ వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీవాట్లు పెట్టింది. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆపి కాలుష్యాన్ని నియంత్రించాలని ఆదేశించింది.

వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టుకు అఫిడవిడ్ సమర్పించింది ఢిల్లీ ప్రభుత్వం. పూర్తిగా లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిగణించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా ఢిల్లీలో జరిగే వాయు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఢిల్లీ రాష్ట్రానికి చుట్టూ ఉన్న దేశరాజధాని ప్రాంతంలో కూడా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని తెలిపింది ఢిల్లీ ప్రభుత్వం.

అత్యవసర సమావేశంలో ఆయా రాష్ట్రాలకు సూచనలు, సలహాలు చేసినట్లు కోర్టుకు తెలిపారు సోలిసిటర్ జనరల్. పార్కింగ్ ధరలు డబుల్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించినట్లు వెల్లడించారు. దీని ద్వారా అనవసరంగా బయటకు వచ్చే వారు వాహనాలను తీసుకురారని వివరణ ఇవ్వగా అలాగే డీజిల్ జనరేటర్లు నిషేధం విధించాలని సూచించింది. బస్, మెట్రో సర్వీస్ లను పెంచాలని సూచించినట్లు తెలిపారు సోలిసిటర్ జనరల్. పంట వ్యర్థాల దహనం ప్రధాన కారణం కాదని సమావేశంలోని నివేదికల ఆధారంగా తెలిసిందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

మొత్తం కాలుష్యంలో 10% మాత్రమే పంట వ్యర్థాల దహనం కారణమని సోలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. అత్యవసర చర్యలను అమలు చేయడానికి రాష్ట్రాలు, ఏజెన్సీలు పూర్తి సంసిద్ధతతో ఉండాలని సూచించింది. రోడ్లను మెకనైజ్డ్ క్లీనింగ్, నీటిని చిలకరించే ఫ్రీక్వెన్సీని పెంచాలని సూచించినట్లు తెలిపారు సోలిసిటర్ జనరల్.

కఠినమైన మూడు చర్యలను ఇంకా తీసుకోవాల్సి ఉందని…సరి-బేసి సంఖ్య వాహనాల విధానం, ట్రక్ ల ప్రవేశం పై నిషేధం, కఠినమైన లాక్ డౌన్ ఈ మూడు అంశాలు పరిగణలో ఉన్నాయని తెలిపింది. వీటిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని సోలిసిటర్ జనరల్ తెలపగా తాము అనుకున్న విధంగా అత్యవసర సమావేశం జరగలేదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

నిర్మాణ పనులు, విద్యుత్ ఉత్పత్తి, రవాణా, దుమ్ము, పంట వ్యర్థాల దహనం కారణాలు….రేపు సాయంత్రంలోగా కార్యాచరణ ప్రణాళికను ఎలా అమలు చేయాలనేది కమిటీని నిర్ణయించాలని ఆదేశించారు. ఏ పరిశ్రమల కార్యకలాపాలను నిలిపివేయాలి, ఏ వాహనాలను నియంత్రించాలో చెప్పాలన్నారు సీజేఐ. రైతులపై చర్యలు తీసుకోవాలని మేము ఒత్తిడి చేయడం లేదు.. పంట వ్యర్ధాల దహనాన్ని వాయిదా వేసేలా చూడాలని తెలిపింది సుప్రీంకోర్టు.

రేపు అత్యవసర సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అదేశిస్తున్నాం…మేము సూచించిన అంశాలపై చర్చించి ఏ చర్యలు తీసుకోవచ్చో వెల్లడించాలని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ ప్రచారాలకు ఎంత ఖర్చు చేస్తున్నారో, కాలుష్య నియంత్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆడిట్ చేయమని ఆదేశించే పరిస్థితి తీసుకురావొద్దని ఢిల్లీ ప్రభుత్వాన్నీ హెచ్చరించింది సుప్రీంకోర్టు.

అన్ని అఫిడవిట్లు ప్రకారం పంట వ్యర్థాల దహనం ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన సమస్య కాకపోయినప్పటికి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని సీజేఐ తెలిపింది. ఆయా రాష్ట్రాలు పంట వ్యర్థాల దహనాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది సుప్రీంకోర్టు. రేపటి అత్యవసర సమావేశంలో యూపీ, హర్యానా, పంజాబ్ ముఖ్యకార్యదర్శులు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు వర్క్ ఫ్రమ్ హోం ఆదేశించాలని కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశించిన సుప్రీం…తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.

- Advertisement -